ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదం చేస్తున్న ఏపీ గిరిజన సంఘ నేతలు
శృంగవరపుకోట రూరల్/శృంగవరపుకోట : మండలంలోని మూలబొడ్డవర, దారపర్తి పంచాయతీలకు చెందిన గిరిజనులు ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎస్.కోటలోని అనంతగిరి రేంజ్ అటవీశాఖ కార్యాలయానికి శుక్రవారం పాదయాత్రగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి అధికారుల తీరును దుయ్యబట్టారు. విల్లంబులు ఎక్కుపెట్టడంతో పాటు డప్పులు వాయిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరించారు.
ఏపీ గిరిజన సంఘం నేతలు జె.గౌరీష్, మద్దిల రమణ, ఆర్.శివ, పి.ధోని, గెమ్మెల సన్నిబాబు, కేత వీరన్న, తదితరులు మాట్లాడుతూ, జీఓ 62 ప్రకారం రద్దైన వనసంరక్షణ సమితి భూములను గిరిజనులకు అప్పగించడంతో పాటు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ఆ భూములపై సాగు హక్కు కల్పించాలన్నారు.
గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు అరికట్టాలని.. నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిశిఖర గ్రామాలకు వెళ్లే రహదారుల ఏర్పాటుకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలని కోరారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్సై జి.ఎస్.నారాయణ, హెచ్‌సీలు నాయుడు, సత్యనారాయణల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అధికారులతో వాగ్వాదం..
చిలకపాడు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన గిరిజనులను బెదిరించి ఫారెస్ట్ అధికారులు తీసుకున్న ఆధార్, రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఖాళీ తెల్ల కాగితాలకు సంతకాలు ఎందుకు చేయించుకున్నారని ఫారెస్టర్లు జె.రమణ, ఎం.సత్యనారాయణ, ఇతర సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ, రిజర్వు ఫారెస్ట్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను 15 మందిపై అటవీచట్టం కేసులు నమోదు చేశామన్నారు. ఏ ఒక్క గిరిజనుడినీ బెదిరించలేదని.. ఆధార్, రేషన్‌కార్డులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇకపై గిరిజనుల జోలికి వచ్చినా, బెదిరింపులకు పాలపడినా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ ఏపీ గిరిజన సంఘ నేత జె.గౌరీష్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment