నూజివీడు : ట్రిపుల్ ఐటీల తొలి బ్యాచ్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఆర్‌వీ రాజకుమార్ పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలలో అమలవుతున్న విద్యావిధానం దేశ వ్యాప్తంగా ఏ విద్యాసంస్థల్లోనూ లేదన్నారు. ఈ సంస్థను స్థాపించడమే ఒక గొప్ప అధ్యాయమన్నారు. తొలి బ్యాచ్ నుంచి మూడు క్యాంపస్‌లకు చెందిన 5,800 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,360మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో 33శాతం మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.
మొత్తం 98శాతం మంది డిస్టింక్షన్, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వివరించారు. వీరిలో 1,304మంది మైనర్ డిగ్రీలు పొందారన్నారు. వీరిలో వంద మందికి పైగా గాత్రం, కూచిపూడి, మృదంగం, తెలుగులలో మైనర్ డిగ్రీలు అందుకున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యతోపాటు మైనర్ డిగ్రీలు అందజేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఆర్జీయూకేటీ మాత్రమేనని పేర్కొన్నారు.
సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ ఆధారిత సంస్థలో ఉద్యోగావకాశాలు లభించేలా ట్రిపుల్ ఐటీ విద్యావిధానం ఉంటుందని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు ఆ రెండు రంగాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లోని విద్యావిధానం గురించి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారని, వచ్చే నెలలో ప్రజెంటేషన్ ఇస్తామని వీసీ చెప్పారు.
రూ.350కోట్లు కేటాయింపు
ఈ విద్యా సంవత్సరానికి మూడు ట్రిపుల్ ఐటీల నిర్వహణ కోసం గతేడాది మాదిరిగానే రూ.350 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నిర్వహణకు మరో వంద ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. వంద ఎకరాలు సేకరిస్తే గ్రంథాలయం, ఆట స్థలాలు, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రాంగణ ఎంపికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే టెక్ మహీంద్రా కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించగా, 170 మంది ఎంపికయ్యారని వివరించారు.
ఒక్క పర్మినెంట్ ఉద్యోగి కూడా లేకుండా 21వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలలో విద్యనభ్యసిస్తున్నారని, ఈ నేపథ్యంలో శాశ్వత ఉద్యోగులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌ల నియామకాలను చేపట్టినప్పటికీ కొన్ని ఆరోపణల నేపథ్యంలో నిలిచిపోయాయన్నారు. అప్పట్లో వచ్చిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు, ఇన్‌చార్జి పరిపాలనాధికారి పరిమి రామనర్శింహం, ఇన్‌చార్జి ఫైనాన్స్ అధికారి జి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. కమిటీ చైర్మన్ అయిన ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆర్‌వీ రాజ్‌కుమార్ అధ్యక్షతన సభ్యులు ఇన్‌చార్జి డెరైక్టర్ కోసూరి హనుమంతరావు, ఇన్‌చార్జి పరిపాలనాధికారి పరిమి రామనరిసింహం, ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సత్యనారాయణ, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సీఈటీఎల్‌ఎస్ డెరైక్టర్ వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ట్రిపుల్ ఐటీలకు స్వయంప్రతిపత్తి కల్పించిన తరువాత ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
క్వార్టర్సులు కేటాయించాలని మెంటార్ల వినతి
అద్దెల భారం పెరిగిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న క్వార్టర్సులను తమకు కేటాయించాలని కోరుతూ మెంటార్ల సంఘం నాయకుడు నూకేష్ గురువారం వైస్ చాన్సలర్ ఆచార్య ఆర్‌వీ రాజకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నెలకు రూ.5వేలు పెట్టి అద్దెకు ఉండాల్సి వస్తోందని, ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో దాదాపు 40 ఫ్లాట్‌లు ఖాళీగా ఉన్నాయని, వాటిని తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెంటార్ల సంఘ నాయకులు సలీంబాబు, మరియారాణి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలకు వేదిక ట్రిపుల్ ఐటీ
Published Fri, Oct 10 2014 2:24 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement