పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ సాధనలో చివ రి పోరాటం చేస్తున్నామని, ఈ దశలో ఎదురవుతున్న అన్ని కుట్రలను తిప్పికొడతామని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేం దర్ అన్నారు. గురువారం పరిగి మార్కెట్ యార్డులో నిర్వహించిన విద్యార్థి గర్జనసభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు స్థానిక అమరవీరుల చౌరస్తాలో అమరవీరులకు, ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విద్యార్థి సంఘం నేత బాల్క సుమన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కుట్రదారులారా ఖబడ్డార్.. మీ కుట్రలన్నీ తిప్పి కొట్టి తెలంగాణ సాధించి తీరుతామని ఉద్ఘాటించారు. ఓట్లు, సీట్ల కోసం కాదు.. ఇక్కడి ప్రజల బతుకు కోసమే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన ఏ ఒక్క జీవో కూడా సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో అమలుకు నోచుకోలేదన్నారు. ఇందుకు నిదర్శనం 610 జీఓయేనని ఆయన స్పష్టంచేశారు. వారి ప్రాంతాల కోసం ఇచ్చిన జీఓలు సాయంత్రం వరకు అమలుకు నోచుకుంటాయన్నారు. తెలంగాణకు ఉపయోగపడే జీఓలు దశాబ్దాలు గడిచినా అమలుకు నోచుకోవని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రాలోని రెండు జిల్లాల్లో ఉన్న డిగ్రీ కళాశాలలు, నాలుగు రాయలసీమ జిల్లాల్లోని మెడికల్ కళాశాలలు తెలంగాణ మొత్తం 10 జిల్లాల వాటితో సమానంగా ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమంతోనే యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు సాధించుకోగలిగామన్నారు. తెలంగాణపై ప్రేమతో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటంలేదు..ఆ పార్టీని ప్రజలు బొందపెడతారనే తెలంగాణపై ప్రకటన చేశారని రాజేందర్ చెప్పారు. కాలుష్యం మాకు.. నీళ్లు మావి, బొగ్గు మాది కొలువులు, సోకులు మీకా అని ఆయన ప్రశ్నించారు. పగలు కరెంట్ మీకు.. రాత్రి కరెంటు తెలంగాణ ప్రజలకా.. ఆ కరెంటుతో చావులు తప్ప ఒరిగిందేమిలేదని ధ్వజమెత్తారు.
బిల్లులోని లోపాలను ఎండగడతాం: హరీశ్వర్‌రెడ్డి
తెలంగాణ బిల్లులోని లోపాలను అసెంబ్లీలో ఎండగడతామని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లను అధికారంలోకి తెచ్చిన తెలంగాణ ప్రజలకు ఆ ప్రభుత్వాలు ఏమిచ్చాయని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో తెలంగాణ ద్రోహిగా నిలిచిపోకూడదనే టీడీపీని వీడి ఉద్యమ బాట పట్టానని హరీశ్వర్ స్పష్టంచేశారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో అపాయింట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రాణహితకు జాతీయ హోదా కల్పించడంలేదని దుయ్యబట్టారు. కుట్రలు తిప్పికొట్టి తెలంగాణ సాధించి తీరుతామన్నారు. నిజాం నిర్మించిన హైదరాబాద్‌పై సీమాంధ్రుల పెత్తనమేంటని హరీశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎన్నోసార్లు అడ్డం తిరిగాను.. కానీ వారి గొడుగు కింద ఏంచేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన రాష్ట్రాల్లాగే ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కిరణ్, బాబులకు అంత సీన్ లేదు: బాల్క సుమన్
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తలకిందులుగా వేలాడినా.. చంద్రబాబు పండి పొర్లాడినా తెలంగాణను ఆపలేరని, వారిద్దరికీ అంతసీన్ లేదని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు చారిత్రక అనివార్యమని పేర్కొన్నారు. ఎవరినో సీఎంను చేయటానికి, మంత్రుల్ని చేయటానికి కాదు తెలంగాణ.. అణగారిన ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకేనన్నారు. టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, కొలువులున్న సంపూర్ణ తెలంగాణను సాధించి తీరుతామన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. 2014 చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచిపోతుందన్నారు.
విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, మండల అధ్యక్షుడు క్లెమెంట్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయిచంద్ బృందం ఆలపించిన తెలంగాణ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, స్థానిక సర్పంచ్ విజయమాల, మల్కాపూర్ సర్పంచ్ భాస్కర్, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు అనూష, ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్, టీఆర్‌ఎస్ చేవె ళ్ల, వికారాబాద్ ఇన్‌చార్జులు సబితానంద్, దేశమ్మొల్ల ఆంజనేయులు, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, స్థానిక నాయకులు బషీర్, అన్వర్‌సేట్, బాబ, మొగులయ్య, అరవింద్‌రావు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కుట్రలను తిప్పికొడతాం
Published Fri, Jan 3 2014 12:30 AM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement
Advertisement