
ఓకన్నేసి ఉంచుదాం!
ఢిల్లీకి టీఆర్‌ఎస్ నేతల బృందం
కేసీఆర్ నివాసంలో భేటీలో నిర్ణయం
బృందంలో మందా, వివేక్, కేకే
దసరాలోపే కరీంనగర్‌లో సభ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం స్థాయిలో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి పార్టీకి చెందిన ఎంపీలను, మాజీ ఎంపీలను ఢిల్లీకి పంపాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కదలికలను బట్టి కార్యాచరణకు దిగాలనే యోచనతో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు శుక్రవారం పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నివాసంలో సమావేశమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే ఉండటంతో తెలంగాణకు వ్యతిరేకంగా ఏమన్నా అడుగులు పడతాయేమోనని ఈ సమావేశంలో కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రమంత్రులను, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి వీలుగా ఢిల్లీ వర్గాలతో సంబంధాలు గల వారితో ఒక బృందం బయలుదేరి వెళ్లాలని నిర్ణయించారు.
ఈ బృందంలో ఎంపీలు మందా జగన్నాధం, జి.వివేక్, మాజీ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్ తదితరులుంటారని తెలిసింది. ఇదిలావుంటే.. తెలంగాణ జేఏసీ ఈ నెల 29న నిర్వహించబోయే సకలజన భేరి కోసం ఈ నెల 25న టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. కరీంనగర్‌లో దసరా లోపల భారీ బహిరంగసభను నిర్వహించాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నారు. అయితే దీనిపై ఇంకా నిర్దిష్టంగా నిర్ణయం జరగలేదని పార్టీ నేతలు వెల్లడించారు. కేసీఆర్‌తో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు కేకే, కడియం శ్రీహరి, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సహనాన్ని పరీక్షించొద్దు: హరీష్‌రావు
సామరస్యపూరిత వాతావరణంలో రాష్ట్రం ఏర్పాటుకావాలనే ఉద్దేశంతో సహనంగా ఉన్నామని, దీనిని చేతకానితనంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావించొద్దని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకులు టి.హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ విభజన నిర్ణయం జరిగిపోయిందని, సీఎం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆపలేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ఇష్టం లేకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు కె.హరీశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సీమాంధ్ర జిల్లాల్లో కృత్రిమ సమైక్య ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి సీఎం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని హరీష్ విమర్శించారు.
తెలంగాణ కోసం సకలజనుల సమ్మె జరుగుతున్నప్పుడు రెండ్రోజులకోసారి ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు కరెంటు రావడం లేదని, విద్యా సంవత్సరం పోతోందని, ఉద్యోగ ప్రకటనలు చేయలేకపోతున్నామని, ఆర్టీసీ నష్టపోతోందని చెప్పాడంటూ పాత వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. తెలంగాణలో రచ్చబండలు పెట్టి పింఛన్లు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ‘ఇప్పుడు సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం జరుగుతుంటే ఆర్టీసీ నష్టపోవడం లేదా? విద్యార్థులకు విద్యా సంవత్సరం పాడు కావడం లేదా? చీకట్లో గ్రామాలు ఇబ్బందులు పడటం లేదా?’ అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమం బలహీనపడకుండా ఉండటానికే 14 లక్షల రేషన్‌కార్డులను, 7 లక్షల పింఛన్లను పంపిణీ చేయకుండా సీఎం నిలిపేశాడని విమర్శించారు. సబ్‌ప్లాన్ నిధులను ఏడాదిలో ఖర్చుచేయాల్సి ఉండగా ఆరునెలలు పూర్తయినా ఇప్పటిదాకా 10 శాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. జీహెచ్‌ఎంసీలో రాత్రిరాత్రికి రాత్రే 35 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం వెనుకు సీమాంధ్ర సంపన్నుల కుట్ర ఉందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌రెడ్డి చెప్పారు.