సాక్షి, కాకినాడ, విశాఖపట్నం: భారత తూర్పు తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ నెల 25 నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఒకటిన్నర మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్‌కాయిస్) తెలిపింది. ఇన్‌కాయిస్ జారీచేసిన సునామీ హెచ్చరికలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి చేరడంతో సిబ్బంది అప్రమత్తమైంది. సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరిలోని రాజమండ్రిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కుర్తుస్తోంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తూర్పుగోదావరి జిల్లాకు పిడుగు హెచ్చరిక
జిల్లాలో శంఖవరం, ప్రత్తిపాడు, మారేడుమిల్లి, రౌతులపడి, వరరామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది.
తుఫానుల హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన
విశాఖ: తూర్పు గోదావరి జిల్లాకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం స్పందించింది. సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు మాత్రమే సునామీ హెచ్చరికలు జారీచేస్తారని, ప్రస్తుతం సముద్రంలో భూకంపాలు రాలేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రంలో గాలుల తీవ్రత వల్లే కెరటాల ఉధృతి 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు మరో 24 గంటలపాటు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉత్తర కోస్తాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment