
తంగిరాలకు అంతిమ వీడ్కోలు
రేలంగి (తణుకు, తణుకు అర్బన్): ప్రముఖ పంచాంగ కర్త, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి(51)కి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమవీడ్కోలు పలికారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థివదేహం ఆదివారం తెల్లవారుజామున రేలంగిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆయన మృతి విషయం తెలుసుకున్న బంధువులు, అభిమానులు, ప్రముఖులు రేలంగి తరలివచ్చి పూర్ణయ్య సిద్ధాంతి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం రేలంగిలోని నరసింహస్వామి ఆలయ ప్రాంతంలోని శ్మశానవాటిక వద్ద శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రాథమిక విద్య రేలంగిలోనే..
తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి 1962 అక్టోబరులో ప్రముఖ పంచాంగకర్త, టీటీడీ ఆస్థాన సిద్ధాంతి హనుమంత్ సిద్ధాంతి, కమలమ్మ దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు రేలంగిలోని తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్ అత్తిలి ఎస్‌వీవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. అనంతరం తండ్రి హనుమంత్ సిద్ధాంతి వద్ద, గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులైన సోమాంచి కృష్ణశాస్త్రి వద్ద జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల్లో అభ్యసనం చేశారు. తండ్రి హనుమంత్ సిద్ధాంతి బాటలోనే ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి నడిచారు. టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా, పంచాంగకర్తగా రాష్ట్రవ్యాప్తంగానే కాక ఒడిషా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు.
అనువంశికంగా 13 తరాలుగా ఈయన కుటుంబం పంచాంగకర్తలుగా పేరుగాంచారు. ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు, వ్యాపార, పత్రికా సంస్థలకు ఏటా పంచాంగం అందించిన ఘనత ఈయనకే దుక్కుతుంది. మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, శారదాపీఠం శృంగేరీ స్వామీజీ వంటి ప్రముఖుల దివ్య ఆశీస్సులు పొందడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో ఉగాది సత్కారాలు, వివిధ సంస్థలచే పౌర సన్మానాలు పొందారు. ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి తల్లి కమలమ్మ, భార్య శ్రీలక్ష్మి, కుమారుడు వెంకట బాల హనుమాన్, కుమార్తె కమల ప్రసన్న, సోదరుడు ప్రసాద్‌లను పలువురు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ దేవస్థానం తరఫున ముఖ్య ఇంజినీరింగ్ అధికారి శ్రీహరి హాజరై సిద్ధాంతి కుటుంబాన్ని పరామర్శించారు.
గోపూజతోనే దినచర్య..
ఇంటి ఆవరణలోని గోవులను ప్రేమగా నిమరడం ద్వారానే ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి దినచర ్య ప్రారంభించేవారు. అనంతరం గృహంలో పూజ కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వాస్తు, పంచాంగ, జ్యోతిష్య సలహా, సూచనల కోసం వచ్చే వారికి వివరంగా అన్ని విషయాలు తెలిపేవారు.
నా శిష్యుడు కావడం గర్వంగా ఉంది
ప్రభాకర పూర్ణయ్య మిత భాషి, నిగర్వి. వాగ్దేవీ కటాక్షాన్ని వాక్కులో ఓలలాడించే సరస్వతీ పుత్రుడు. జ్యోతిష్య శాస్త్ర, ముహూర్త జాతక రంగాల్లో మేటి విద్వాంసుడుగా రాణించిన అతడు నా విద్యార్థి కావడం గర్వంగా ఉంది.
- భాగవతుల విశ్వనాథశర్మ, రిటైర్డ్ తెలుగు పండితులు, తణుకు
రేలంగికి మంచి పేరు తెచ్చారు
తణుకు వద్ద రేలంగి అనగానే రేలంగి సిద్ధాంతిగారి ఊరు అనే విధంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి మంచి పేరు తెచ్చారు. ఉదార స్వభావమున్న వ్యక్తి. ఎందరో ప్రముఖులు ఆయన కోసం గ్రామానికి వచ్చేవారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటు.
- వడ్డి మార్కండేయులు, ఉపసర్పంచ్, రేలంగి