అనాథ పిల్లలతో వైవీ సుబ్బారెడ్డి దంపతులు
తిరుపతి సెంట్రల్: ఒకరు తల్లిని కోల్పోతే.. ఇంకొకరికి తండ్రి లేడు..తల్లీ తండ్రీ లేని అభాగ్యులూ ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..పైగా అందరూ దివ్యాంగులు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఆ 17 మందికీ ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న బలమైన కోరిక ఉండేది. కానీ ఇందుకు ఆర్థిక పరిస్థితి, అంగవైకల్యం అడ్డుపడేవి. అయితే వారి సంకల్పానికి దైవ బలం తోడై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఔదార్యంతో వారి చిరకాల వాంఛ తీరింది. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడంతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, గోల్డెన్ టెంపుల్, గోవిందరాజ స్వామి ఆలయాలను సందర్శించారు. దీంతో చిన్నారుల మోములో ఆనందం వెల్లివిరిసింది.
వైవీ సుబ్బారెడ్డిని ఎలా కలిశారంటే..
శ్రీకాకుళానికి చెందిన సామాజికవేత్త సిద్ధార్థ చాలా కాలం నుంచి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 17 మంది దివ్యాంగ బాలలు ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలాకాలం నుంచి సిద్ధార్థకు చెప్పేవారు. ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే సింహాచలం దేవస్థానానికి దర్శనార్థం వెళ్లారు. సిద్ధార్థ ఆయన్ని కలిసి అనాథ పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు. వారందరికీ సొంత ఖర్చులతో దర్శన ఏర్పాట్లతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆదివారం తిరుపతిలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు వారికి నూతన వస్త్రాలను అందజేసి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment