తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక సమావేశం గురువారం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం టీటీడీ నిర్వహించనుంది. తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశంలో పాల్గొంటుండగా మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొననున్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి పాలకమండలి సమావేశం కీలకంగా మారింది.
► ప్రధానంగా టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారడం, ప్రభుత్వం గత పాలకమండలి తీర్మానాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశంపై పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
► మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేత కారణంగా టీటీడీ ఇప్పటికే రూ.400 కోట్ల రాబడి కోల్పోయింది. మే నెల జీతాలు చెల్లింపు తరువాత టీటీడీ వద్ద నిధుల కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి నిధులు వాడకుండా ఓడీ (ఓవర్‌డ్రాప్ట్)కి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎస్‌బీఐలో టీటీడీకి రూ.300 కోట్లు ఓడీ 0.75 శాతం వడ్డీకే లభించే అవకాశం ఉంది.
► ఇక శ్రీవారి ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభించే సమయంలో ఏ విధానాన్ని అవలంబించాలన్న అంశంపైనా పాలకమండలి ఫోకస్ పెట్టనుంది. మొదటి దశలో రోజుకి 7వేల మంది భక్తులకే దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసి తర్వాత విడతల వారీ మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలపనుంది.
► మరో వైపు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి అనుమతులు జారీ చేయనుంది. గరుడ వారధికి నిధులు కేటాయింపు అంశంపై ఈ సమావేశం నిర్ణయం తీసుకోనుంది.
► టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి సంబంధించి 47 పోస్టులు భర్తీ ప్రకియ మొదలు పెట్టే అంశం పై పాలకమండలి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఇక అవిలాల చెరువును తుడాకి అప్పగించే అంశంపైనా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపుపైనా చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment