అమెరికాలో నాలుగు చోట్ల శ్రీనివాస కళ్యాణాలు
తిరుమల: అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలు జరపాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తానా సహకారం అందిస్తుందని తెలిపారు. మంగళవారం తిరుమలలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలో వకుళామాత అతిథి గృహ నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఊపమాత గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల, తంబళ్లపల్లిలో సోలార్ సిస్టమ్ ద్వారా 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. తిరుమలలో 1.50 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచడానికి... మరో 400 హెక్టార్లలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదికి 12 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచుతామన్నారు. రూ.22 లక్షలతో ఆరునెలలకు సరిపడా కొబ్బరికాయాలు కొనడానికి కూడా పాలక మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.