తోడుంటాడనుకుంటే.. తోడేలయ్యాడు! | tutor sexuval attack on students! | Sakshi
Sakshi News home page

తోడుంటాడనుకుంటే.. తోడేలయ్యాడు!

Published Sun, Jan 5 2014 2:39 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

tutor sexuval attack on students!

సాక్షి, నల్లగొండ/హాలియా, న్యూస్‌లైన్: ‘సార్ తోడుగా పడుకుంటారు.. ఇక భయపడాల్సింది లేదని ధైర్యంగా ఉంటే.. ఆ సారే ఇలా చేయడంతో ఎవరికి చెప్పుకోలేకపోయామని, ఎవరికైనా చెబితే సార్.. కొడతానని బెదిరించాడు’ అని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధి ఏనేమీది తండాలో వీఆర్వో సంస్థ ఆశ్రమంలోని 12 మంది విద్యార్థినులపై అక్కడ పనిచేస్తున్న ట్యూటర్ లైంగికదాడి చేశాడనే విషయం వెల్లడికావడంతో తల్లిదండ్రులతో పాటు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం విచారణ నిమిత్తం ఆయా గ్రామాలకు వెళ్లిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆ నీచుణ్ని కాల్చి వేయకుండా.. అదుపులోకి తీసుకున్నారెందుకు’ అంటూ మహిళలు జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావుపై మండిపడ్డారు. ‘వాడ్ని ఉరితీయాల్సిందే’అని ఓ కన్నతండ్రి రోదిస్తూ డిమాండ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని ఉరి తీయాలని ఐద్వా, సీపీఐ నాయకురాళ్లు పట్టుబట్టారు. అందరూ సాక్ష్యం చెబితే త్వరలోనే నిందితుడి శిక్ష పడుతుందని ఎస్పీ అన్నారు.


 నిర్వాహకురాలి భార్యకు తెలిసినా...: ట్యూటర్ అఘాయిత్యాన్ని కొందరు బాలికలు గతేడాది దీపావళి పండుగ సమయంలో ఆశ్రమం నిర్వాహకుడైన శ్రీనివాసరావు భార్యకు వివరించారు.‘అన్నలాంటి హరీష్ ఇలాంటి పనులు చేయబోడని భావించినట్లు చెబుతున్న ఆమె.. ఈ విషయాన్ని అక్కడితో వదిలేసింది. తాజాగా ఈ ఉదంతం బయట పడిన సమయంలోనూ ఓ బాలికకు రక్తస్రావం జరుగుతుండగా.. నిర్వాహుకులైన భార్యాభర్తలు ఆ బాలిక పుష్పవతి అయ్యిందంటూ ముఖానికి పసుపు పూసి ఈ నెల ఒకటిన ఆమె ఇంటివద్ద వదిలి వచ్చేశారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
 గోనే సంచుల్లో దాచి..: సార్..ముసుగులో దారుణాన్ని కొనసాగిస్తున్న ట్యూటర్‌కు ఆశ్రమంలో వంట చేసే వారికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి అతను రాత్రిళ్లు ఇంటికి వెళ్లిపోయేవాడు. కానీ..  చిన్నారులను ఇంటికి పిలిపించుకొని  లైంగికదాడికి పాల్పడేవాడు. ఈ సమయంలో ఎవరైనా వస్తే గోనేసంచుల్లో దాచిపెట్టేవాడని బాధితులు చెప్పారు.
 
 నిందితుడి అరెస్టు: 12మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన ట్యూటర్ హరీష్‌తోపాటు ఆశ్రమ వార్డెన్‌ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రభాకర్ వెల్లడించారు. నిందితుడు హరీష్‌పై  నిర్భయతోపాటు మరో రెండు సెక్షన్లు, వార్డెన్ శ్రీనివాస్‌పై మరో సెక్షన్ కింద కేసులను నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
 
 
 విచారణకు సీఎం ఆదేశం


 ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.


 21లోగా నివేదిక ఇవ్వండి: హక్కుల కమిషన్


 ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి ఈ నెల 21లోపు నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ఎస్పీలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శనివారం హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement