సాక్షి, హుజూర్‌నగర్ : తమ పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని మండల పరిధిలోని బూరుగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హెచ్‌ఎంకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం బూరుగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. వీరిలో ఐదుగురు బాలురు, 19 మంది బాలికలు ఉన్నారు. వీరిలో ఐదుగురు బాలికలను పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఐదు నెలలుగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఓ బాలికను మరింతగా వేధిస్తున్నాడు. పైగా సదరు ఉపాధ్యాయుడు రాత్రి సమయంలో మద్యం సేవించి బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లల ప్రవర్తన బాగోలేదంటూ తరచూ ఫిర్యాదు చేస్తున్నాడు. బాలికలను మోకాళ్లపై నిలబెట్టి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి వాటిని గ్రూపుల్లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు.
హెచ్‌ఎంకు ఫిర్యాదు
ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేని విద్యార్థినులు మంగళవారం సాయంత్రం స్టడీ అవర్స్ పూర్తి కాగానే హెచ్‌ఎం బీరెల్లి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం ఆయన పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్‌కు తెలియజేశారు. విషయం తెలియడంతో కొందరు గ్రామ పెద్దలతో కలిసి పాఠశాలకు వచ్చారు. బాలికలను వేధిస్తున్న ఘటనపై ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ ఇతర గ్రామ పెద్దలు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన్ని మందలించారు. స్టడీ అవర్స్ నుంచి సదరు ఉపాధ్యాయుడిని తొలగిస్తున్నట్లు, కేవలం విధులు మాత్రమే నిర్వహించాలని హెచ్‌ఎం ఆదేశించారు. సెల్‌లో విద్యార్థినుల ఫొటోలు తొలగించాలని ఆదేశించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం
బూరుగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలను వేధిస్తున్నట్లు ఓ ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్థానిక సర్పంచ్, పలువురు గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించాం. తిరిగి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తా.
– బీరెల్లి శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఎం, బూరుగడ్డ
Comments
Please login to add a commentAdd a comment