
రెండు కోట్ల ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: మండలంలోని ఎం.కొంగరవారిపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, టిప్పర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఐ అశోక్‌కుమార్ కథనం మేరకు.. ముందుగా అందిన సమాచారం మేరకు ఆర్‌ఎస్‌ఐలు భాస్కర్, వాసు తమ బృందంతో గురువారం తెల్లవారుజామున ఎం.కొంగరవారిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో దాడి చేశారు. సుమారు 80 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను టిప్పర్‌లో లోడ్ చేస్తుండగా దాడి చేశారు. కూలీలు దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. టిప్పర్, సుమారు రెండు టన్నుల బరువు గల 63 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
డీఐజీ కాంతారావు పరిశీలన
ఎం.కొంగరవారిపల్లి సమీపంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పారిపోయిన కూలీలను పట్టుకోవడానికి అదనపు బలగాలను రప్పించామన్నారు.
పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలి
చంద్రగిరి:ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేం దుకు ప్రయత్నిస్తున్న పోలీసు అధికారులకు వెంటనే అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తెలిపారు. ఎం.కొంగరవారిపల్లి సమీపంలో రూ.రెండు కోట్ల ఎర్రచదనం దుంగలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన భాద్యత జిల్లాలోని ప్రజలందరిపైనా ఉందన్నారు. ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించి సహాయ పడాలని కోరారు.