నేపాల్ పోలీసులు మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. ఈ ఉదంతంలో 11 మంది భారతీయులను రక్షించడంతో పాటు ఎనిమిది మంది భారతీయ మాఫియా ముఠా సభ్యులను, వారి నేపాలీ సహచరులను అరెస్టు చేశారు.
ఈ ముఠా 11 మంది భారతీయ పౌరులను అమెరికాకు పంపుతామని చెబుతూ, రెండు వారాలకు పైగా బందీలుగా ఉంచినట్లు సమాచారం. ఈ ఉదంతం బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘డాంకీ’ చిత్రాన్ని పోలివుండడంతో నేపాల్ పోలీసులు దీనికి 'ఆపరేషన్ డాంకీ' అనే పేరు పెట్టారు. మాఫియా నుంచి రక్షణ పొందినవారు, ఇటు వారిని ఉచ్చులో బిగించినవారు భారత్‌లోని పంజాబ్, హరియాణాలకు చెందినవారు.
ఖాట్మండు జిల్లా పోలీసు రేంజ్ బృందం ఫిబ్రవరి 14 రాత్రి నుండి ఈ ఆపరేషన్ ప్రారంభించింది. తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగించింది. పక్కా సమాచారం మేరకు రాటోపుల్‌లోని ధోబిఖోలా కారిడార్‌లోని ఒక నేపాలీ పౌరుని నివాసంపై దాడి చేసి, 11 మంది భారతీయ పౌరులను రక్షించారు. వీరిని మెక్సికో మీదుగా అమెరికాకు పంపుతామని నమ్మించి బందీలను చేశారు.
ఈ మానవ అక్రమ రావాణా ముఠా ముఖ్యంగా విద్యార్థులను అమెరికాకు పంపుతామని తప్పుడు హామీలిచ్చిందని జిల్లా పోలీసు చీఫ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపేంద్ర బహదూర్ ఖత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముఠా సభ్యులు తాము వల వేసినవారిని ఖాట్మండుకు తీసుకు వచ్చినప్పుడు వీసా రుసుముగా ఒక్కొక్కరి నుండి రూ.45 లక్షలతో పాటు అదనంగా మరో మూడు వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. నిందితులపై నేపాలీ చట్టం ప్రకారం కిడ్నాప్, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఆ ఏజెంట్లు తమను బందీలను చేసి, రెండు వారాలకు పైగా అద్దె ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. తమను మానసికంగా, శారీరకంగా హింసించి బెదిరించారన్నారు. వారు తమకు ఇచ్చిన వీసాలు, బోర్డింగ్ పాస్‌లతో సహా అన్ని పత్రాలు నకిలీవేనని పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి పోలీసులు నకిలీ రబ్బరు స్టాంపులు, ఇతర నకిలీ పత్రాలతో పాటు బాధితుల పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment