లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్‌లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్‌గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.
మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment