బొబ్బిలి : వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. రెండేళ్లుగా ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదు.. ఊర్లు వేరైనా ఒకే దగ్గర ఉంటున్నారు. ఇద్దరివీ పేద కుటుంబాలైనా చదువులో బాగా రాణిస్తున్నారు. స్నేహితుడు అన్నయ్య పెళ్లికి ఆహ్వానించడంతో సొంత వాహనం వేసుకొని వచ్చారు. ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడిన సంఘటనలో ఇద్దరూ ఒకేసారి కన్నుమూశారు. మండలంలోని కలవరాయి వద్ద బుధవారం రాత్రి స్కార్పియో వాహనం చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు అక్కడకక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.. విశాఖపట్నం పెద గంట్యాడకు చెందిన కునికూని దుర్గారావు, మునగపాక మండలం వాడ్రవల్లి గ్రామానికి చెందిన కాకి లక్ష్మీనారాయణలు ఈ దుర్ఘటనలో దుర్మరణం చెందారు.
కలెక్టర్ అవుతాననేవాడు..
వాడ్రపల్లి గ్రామానికి చెందిన కాకి లక్ష్మీనారాయణ పేద కుటుంబానికి చెందిన వాడు. తండ్రి రమణబాబు ఆటోను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అరుుతే లక్ష్మీనారాయణ బాగా చదువుతుండడంతో ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. పదో తరగతిలో 480, డిప్లమోలో 85 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం విశాఖ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ చదువుతూ, పెదగంట్యాడలోని పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. అక్కడే స్నేహితుడు దుర్గారావు పరిచయం కావడంతో ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు. రెండు రోజుల కిందట కుటుంబమంతా గాజువాకలోని దగ్గర బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇంతలో స్నేహితుడి అన్న పెళ్లి కోసం వాహనంలో బయలుదేరిన లక్ష్మీనారాయణ దురదృష్టవశాత్తూ మృతి చెందాడు. కలెక్టర్ కావడమే తన లక్ష్యమని చెబుతుండేవాడని తండ్రి రమణబాబు రోదిస్తూ తెలిపారు.
మృతదేహాలు అప్పగింత
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్గారావు, లక్ష్మీ నారాయణల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదం వార్త తెలియగానే తెల్లారిసరికి ఇరు కుటుంబాల తల్లిదండ్రులు బొబ్బిలి ఆస్పత్రికి చేరుకున్నారు. సీఐ వై రవి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టమార్టం చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ముగిసిన జీవితం
అమ్మా స్నేహితుడు అన్నయ్య పెళ్లి అయిపోయింది.. మధ్యాహ్నం భోజనాలు కూడా చేసేశాం.. సాయంత్రం బయలుదేరి వచ్చేస్తామని చెప్పిన కొడుకు శవమై కనిపించేసరికి దుర్గారావు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.దుర్గారావు తన అన్నయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని తీసుకొని తనతో చదువుకుంటున్న లక్ష్మీనారాయణ. మోహన్‌లతో పాటు స్నేహితుడి అన్నయ్య పెళ్లికి బొబ్బిలికి వచ్చాడు. తిరుగు ప్రయూణంలో వాహనం బోల్తా పడడంతో దుర్గారావు సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. ఆ సమయంలో దుర్గారావే డ్రైవింగ్ చేస్తున్నాడు. మృతుడి తండ్రి నారాయణరావు కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నారు. దుర్గారావు ప్రస్తుతం విశాక ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
మృత్యువులోనూ వీడని ‘బంధం’
Published Thu, Apr 28 2016 11:56 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM
Advertisement