కొత్త సంవత్సరం రోజే విషాదం
తిరుమలకు వెళుతూ ప్రమాదం
బీటెక్ విద్యార్థి దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కొత్త సంవత్సరం ప్రారంభం రోజే జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. వేర్వురు ఘనటనల్లో ఇద్దరు మృత్యువాత పడగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త సంవత్సరం తొలి రోజున తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే.. అంతా మంచి జరుగుతుందని భావించి తన స్నేహితులతో కలిసి కారులో బయలుదేరిన ఓ యువకుడు మధ్యలో ఆ స్వామి సన్నిధికే చేరిపోయాడు. కొత్త సంవత్సరం ప్రారంభంతో స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్న మరో యువకుడు ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మృత్యువుకు చేరువయ్యాడు.
కొడవలూరు : బీటెక్ విద్యార్థులు కారులో తిరుమలకు వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలం లోని రాచర్లపాడు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట ప్రాంతానికి చెందిన మణికంఠ (18) బీటెక్ చదువుతున్నాడు. కొత్త సంవత్సరం రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు స్నేహితులైన వరప్రసాద్ (20), గణేష్ (21)తో కలసి మణికంఠ సొంత కారులో ఆదివారం తెల్లజామున తిరుమలకు బయలుదేరారు.
రాచర్లపాడు వద్దకు చేరుకునే సరికి కారు నడుపుతున్న మణికంఠ నిద్రలోకి జారుకోవడంతో కారు ఫ్లై ఓవర్ వంతెన ఎంట్రన్స్ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మణికంఠ అక్కడకక్కడే మృతి చెంది అందులోనే ఇరుక్కుపోయాడు. మణికంఠ స్నేహితులు వరప్రసాద్, గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్ వాహనంలో నెల్లూరులోని సింహపురి వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ అంజిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబరాలు చేసుకుని వెళ్తూ..
చేనిగుంట (తడ) : స్నేహితులతో నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో పాల్గొని ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన జాతీయ రహదారిపై చేనిగుంట వద్ద రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. సూళ్లూరుపేట మండలం సామంత మల్లాం గ్రామానికి చెందిన చిట్టేటి చైతన్య (27), ఎరుగరాజుల కిషోర్ శనివారం రాత్రి తడలో జరిగిన నూనత సంవత్సరం వేడుకల్లో పాల్గొని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. తడ నుంచి ఐదు కిలో మీటర్లు ప్రయాణించిన మీదట ప్రమాదానికి గురయ్యారు. రాత్రి ఎప్పుడు ప్రమాదం జరిగిందో కానీ.. ఉదయం 6 గంటలకు వరకు వెలుగులోకి రాలేదు.
ఉదయం వరదయ్యపాళెం నుంచి అక్కంపేటకు బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఈఎంటీ సురేష్, పైలెట్ సుధీర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చైతన్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కిషోర్ మాత్రం ప్రాణాలతో ఉండటంతో సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు యువకులు రోడ్డుకి దూరంగా ఒకరి పక్కన ఒకరు పడి పోవడం, బైక్ మరికొంత దూరంలో చెట్లల్లో పడిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్లే వారికి ప్రమాదం విషయం తెలియలేదు. చైతన్య తడ నిప్పో పరిశ్రమలో పనిచేస్తుండగా, కిషోర్ శ్రీసిటీలోని వీఆర్‌వీ పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ అవివాహితులు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి, సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. సంఘటనా స్థలాన్ని తడ ఎస్‌ఐ సురేష్‌బాబు పరిశీలించారు. చైతన్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.