విశాఖపట్నం, న్యూస్‌లైన్: అమ్మ పుట్టిన రోజు ఘనంగా జరపాలి...మంచి బహుమతి ఇవ్వాలి... ఎలాగూ సెలవురోజు వచ్చింది... ఈ రోజే బహుమతి కొనుక్కొచ్చేస్తా అంటూ బయలుదేరిన కొడుకు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని ఆ తల్లి ఊహించి ఉండదు. ప్రాణస్నేహితుడి మాట కాదనలేక అతనితో బయలుదేరిన ఆ యువకుడూ ఊహించి ఉండడు అదే తన ఆఖరి ప్రయాణమని. బీఆర్‌టీఎస్ రోడ్డుపై మర్రిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం మిగిల్చిన విషాదమిది.
బైక్ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై తుళ్లిపడిన యువకులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. ప్రత్యక్షసాక్షులు, ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు...గోపాలపట్నం ఇందిరానగర్‌కు చెందిన జున్నూరు ప్రేమ్ (21), న్యూకరాసాకు చెందిన బోని ప్రదీప్‌చంద్ర (21) ప్రాణస్నేహితులు. పైడా ఇంజినీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం కళాశాలకు సెలవు. గురువారం తల్లి పుట్టిన రోజు ఉండడంతో బహుమతి కొనేందుకు ప్రేమ్ బైక్‌పై బయలుదేరాడు.
ప్రదీప్ ఇంటికి వెళ్లి అతన్ని తోడ్కొని నగరానికి బయలుదేరాడు. అప్పటికే వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మర్రిపాలెం వద్ద వీరి బైక్ అదుపుతప్పి పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై తుళ్లిపడిన వీరిని అటుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రేమ్ హెల్మెట్ ధరించినా ప్రమాద సమయంలో అది తుళ్లిపోవడంతో మరణం తప్పలేదు. ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. ప్రేమ్ తండ్రి ఎక్సైజ్ శాఖలో ఎస్‌ఐగా, ప్రదీప్ తండ్రి గంగరాజు రైల్వేలో పనిచేస్తున్నారు. ట్రాఫిక్ సీఐ మళ్ల శేషు ఆధ్వర్యంలో ఎస్‌ఐ తాతారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాయనా...ఇదేనా బహుమతి
ప్రేమ్ మృతదేహం వద్ద అతని తల్లి రోదిస్తున్నతీరు పలువురి కంటనీరు తెప్పించింది. ‘నా పుట్టిన రోజుకి బహుమతి తెస్తానని బయలుదేరిన కొడకా... ఇదేనా నీవు నాకిచ్చిన బహుమతి’ అంటూ ఆమె గుండెలు బాదుకుని భోరుమంటుంటే చూపరులు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. ఇంజినీరింగ్ చదువుతున్న నీవు మా ఆశలు తీరుస్తావంటే ఇలా చేశావేం నాయనా అంటూ గుండెలవిసేలా రోదిస్తున్న ఆమెను ఆపడం ఎవరి తరమూ కాలేదు. మరోవైపు స్నేహితుడి మాట కాదనలేక బయలుదేరిన ప్రదీప్ మృత్యువాత పడడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా మెలుగుతున్న ఇద్దరినీ చావు కూడా విడదీయలేకపోయింది. ఘటనా స్థలిలో పడివున్న మృతదేహాలను చూసి రెండు కుటుంబాలవారు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
Published Thu, Aug 29 2013 4:02 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement