ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఏఎన్‌యూ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజయలక్ష్మిలతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందన్నారు.
ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి ఘటనకు దారితీసిన కారణాలు, రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై గతంలో విచారణ జరిపిన కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యంను కూడా వీరిద్దరితోపాటు ఏఎన్‌యూలో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. పూర్తిస్థాయి వీసీ, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం 50శాతం భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కొత్త విద్యాలయాలు ప్రారంభమైయ్యాని.. వచ్చేఏడాది మరో 3 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేఏడాది ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తున్నామని అన్నారు.