రెండు పద్ధతుల్లో రైతులకు భూ పంపిణీ!
రాజధానిపై సర్కారు కసరత్తు
ప్రభుత్వం, రైతులకు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయడం మొదటి పద్ధతి
అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం రైతులకివ్వాలన్నది రెండో పద్ధతి
6వ తేదీన విధివిధానాల ఖరారు..
విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పద్ధతులను అనుసరించాలని భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే, రైతులకు ఎంతమేరకు భూమి ఇవ్వాలన్న విషయంపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం, రైతుల మధ్య పరస్పర ప్రయోజనం కలిగేలా రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించించే భూముల్లో ప్రభుత్వం, రైతులు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది ఒక ప్రతిపాదన. అభివృద్ధి చేసిన భూముల్లో 20 శాతం రైతులకు ఇవ్వడం రెండో పద్ధతి. ఈ రెండింటిలో దేనిని అనుసరించాలన్న విషయంపై కసరత్తు జరుగుతోంది. అలాగే భూములిచ్చే రైతులు దాదాపు మూడేళ్లపాటు ఎటువంటి ఆదాయం లేకుండా పంటను నష్టపోయే అవకాశం ఉన్నందున అర్హత కలిగిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున చెల్లించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా 6న జరిగే సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆరోజునే విధివిధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం.
మొదటి దశ మంగళగిరి నుంచే..
రాజధానికి అవసరమైన భూమిని 4 దశల్లో సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ ఫూలింగ్ విధివిధానాలు ఖరారై, రైతులు ఇందుకు ఆమోదం తెలిపితే తొలి దశలో మంగళగిరి నుంచే భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళగిరి అయితే అన్నింటికీ మంగళకరమన్న పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరి, ఉండవల్లి, తాడేపల్లి, తుళ్లూరు, అమరావతి మండలాల్లోని కొన్ని ప్రాంతాల భూములను తొలి దశలో సేకరించే అవకాశముందని సమాచారం.
మళ్లీ భూముల ధరలకు రెక్కలు.
వీజీటీఎం పరిధిలోనే నూతన రాజధాని నగరం ఉంటుందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన గుంటూరు, తెనాలి ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయుక్తంగా మారింది. నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా నూజివీడు, ఇబ్రహీంపట్నం, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, గన్నవరం వైపు పరుగులు తీసిన జనం ఆదివారం నుంచి తెనాలి, గుంటూరు వైపు చూస్తుండటంతో మళ్లీ రియల్ వ్యాపారానికి ఊపొచ్చినట్లయ్యింది.