రాఖీ కట్టకుండానే తిరిగిరాని లోకాలకు..
Published Wed, Aug 21 2013 3:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
బొబ్బిలిటౌన్, న్యూస్‌లైన్ : చెన్నై నుంచి వస్తున్న తమ్ముడికి రాఖీ కట్టి, గల్ఫ్ వెళ్తున్న తన తండ్రికి వీడ్కోలు పలికి.. కన్నవారింట్లో రెండు రోజులు ఉండి అక్కడి వారి ప్రేమానురాగాలను పంచుకోవాలని పట్టణంలోని సంఘవీధికి చెందిన సుధారాణి (25) ఆశపడింది. దీంతో విశాఖపట్నంలోని తల్లిదండ్రుల చెంతకు మంగళవారం బయల్దేరింది. అయితే బస్సులు తిరగపోవడంతో తమ కుటుంబ స్నేహితుడు అయిన మండలంలోని కలవరాయి గ్రామానికి చెందిన మహేష్(28) ఆటోలో బయలుదేరింది. ఆమెను ఆటోలో రామభధ్రపురం తీసుకునివెళ్లి అక్కడ నుంచి ఎలాగైనా విశాఖపట్నం పంపించాలని మహేష్ భావించాడు. మంగళవారం ఆటోల బంద్‌కు పిలుపునివ్వడంతో దానిని దృష్టిలో పెట్టుకుని స్థానికి కోటి చెరువు మార్గం గుండా గున్నతోటవలస గ్రామం మీదుగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
గున్నతోట వలస గ్రామం సమీపంలో కాపలా లేని గేటు వద్ద ఆటోతో పాటు పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే అకస్మాత్తుగా పట్టాల మధ్యలో ఆటో నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలకుండా మొరాయించింది. ఇంతలో దుర్గ్ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న పాసింజర్ రైలు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొందని స్థానికులు తెలిపారు. దీంతో ఆటో డ్రైవర్ మహేష్‌తో పాటు, అందులో ప్రయాణిస్తున్న సుధారాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో సుమారు కిలో మీటరున్నర దూరం వరకూ ఆటోను రైలు ఈడ్చుకుని పోయింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. మహేష్, సుధారాణిల మృతదేహాలు నుజ్జు అయి వేర్వేరు చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
సుధారాణి మృతితో మిన్నంటిన బంధువుల రోదనలు
సుధారాణి మరణ వార్త విన్న ఆమె భర్త రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. తన భార్యను ఎలాగైనా బతికించండటూ అక్కడికి వచ్చన వారి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి మృతి గురించి తెలియని సుధారాణి రెండేళ్ల కుమారుడు దీనంగా, బిత్తర చూపులు చూస్తుండడం అక్కడి వారిని కలిచివేసింది.
కాపలా లేని గేటుతో ప్రమాదాలు
గున్నతోటవలస గ్రామం వద్ద మలుపులు ఉండటం, అక్కడ పట్టాలు దాటే స్థలంలో ఏర్పాటు చేసిన గేటుకు ఎవరూ కాపలా లేక పో వడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. గతంలో కూడా ఇదే స్థలంలో పలు ప్రమాదాలు సంభవించాయి. ఇక్కడ పూర్తి స్థాయి గేటును ఏర్పాటు చేసి వెంటనే గేటు కీపర్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రెండు గంటలపాటు నిలిచిన పాసింజర్ రైలు
రైలు బలంగా ఢీకొనడంతో ఇంజన్ భాగంలో ఆటో కూరుకుపోయింది. రైలు ముందుకు కదలితే పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించి.. సంఘటనా స్థలంలోనే నిలిపి వేశారు. డ్రైవర్ వెంటనే బొబ్బిలి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చి ఇంజన్ భాగంలో చొచ్చుకుపోయిన ఆటోను తొలగించారు.
మృతుల కుటుంబాలకు బేబీనాయన పరామర్శ రైలు ప్రమాదంలో మృతి చెందిన సుధారాణి, మహేష్ కుటుంబాలను ైవె ఎస్‌ఆర్ సీపీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు బేబీనాయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి తెంటు లకు్ష్మనాయుడు కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement