పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి | Two Persons Attack On Five People Over Love Issue In Chittoor | Sakshi
Sakshi News home page

పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి

Published Fri, Aug 30 2019 11:00 AM | Last Updated on Fri, Aug 30 2019 11:09 AM

Two Persons Attack On Five People Over Love Issue In Chittoor - Sakshi

గాయపడిన మేకల చంద్రశేఖర్

సాక్షి, మదనపల్లె : ప్రేమ వ్యవహారంలో తలదూర్చారనే కారణంతో ఓ యువకుడు, అతని అన్న కలిసి పెద్దమనుషులపై కోడి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురువారం రాత్రి నిమ్మనపల్లె మండలం, ముస్టూరు పంచాయతీ, దిగువపల్లెలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముస్టూరు పంచాయతీ పారేసువారిపల్లెకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మన్న అలియాస్‌ లక్ష్మినారాయణ, మనోహర్‌ అలియాస్‌ మణికుమార్‌ అన్నదమ్ములు. మనోహర్‌ వారం రోజుల క్రితం అదే పంచాయతీ దిగువపల్లెకు చెందిన వివాహితను తీసుకెళ్లాడు.

ఈ విషయమై ఆమె భర్త గ్రామ పెద్దలతో గురువారం రాత్రి ఊర్లో పంచాయితీ పెట్టించాడు. గ్రామపెద్దలు అందరూ కలసి అన్నదమ్ములు లక్ష్మన్న, మనోహర్‌ను దిగువపల్లెకు పిలిపించారు. పంచాయితీ చేస్తుండగా మాటమాటా పెరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దిగువపల్లెకు చెందిన పెద్దమనుషులు మేకల రాజన్న కుమారుడు చంద్రశేఖర్‌(28), మక్కినేని లక్ష్మన్న కుమారుడు రైతు చంద్ర(58), అజయ్‌(26), కిరణ్‌ సింగ్‌(32)పై లక్ష్మన్న, మనోహర్‌ కోడికత్తులతో దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో లక్ష్మన్న కూడా గాయపడ్డాడు. వీరిలో ఇద్దరిని కుటుంబసభ్యులు 108 వాహనంలో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అజయ్, మరో వ్యక్తిని నిమ్మనపల్లె పీహెచ్‌సీకి తరలించారు.

మదనపల్లెలో క్షతగాత్రులను పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించిన అనంతరం మేకల చంద్రశేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో దిగువపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ అశోక్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ముదివేడు, నిమ్మనపల్లె పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గొడవలు పునరావృత్తం కాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement