రాలిన విద్యా కుసుమాలు | Two students killed in a road accident | Sakshi
Sakshi News home page

రాలిన విద్యా కుసుమాలు

Published Thu, Mar 5 2015 1:54 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

రాలిన విద్యా కుసుమాలు - Sakshi

రాలిన విద్యా కుసుమాలు

కూలి పనిచేస్తూ చదువుతున్న అజయ్  పెళ్లి పీటలు ఎక్కబోయి పాడెక్కిన హంస
 
 చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విగత జీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు చలించిపోయారు. వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ నేపథ్యం చూస్తే మృత్యువు కూడా ఎందుకు వీరిపై యమపాశాన్ని విసిరామా..? అని కన్నీరు పెట్టకతప్పదు.
                                                           
చిత్తూరు (అర్బన్): యాదమరి మండలం కొట్టాలకు చెందిన శ్రీనివాసులు, కమలమ్మ రెండో కుమారుడు అజయ్ (16). ఊహ తెలిసిన నాటికే నాన్న చనిపోయాడు. నిరుపేద కుటుంబం. ఉండడానికి సొంత ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. తల్లి కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో 9.2 మార్కులతో పదో తరగతి పాసయిన అజయ్ పెద్దయితే ఇంజనీరయ్యి పేదరికాన్ని జయించాలని ఎంపీసీలో చేరాలనుకున్నాడు. కానీ దానికి డబ్బులు ఎక్కువవుతుందని తెలుసుకుని రాజీపడి సీఈసీ చదవడానికి చిత్తూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడా పేదరికం వెక్కిరించడంతో  రెండు నెలలుగా కళాశాల ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతూ మంగళవారం రూ.1,500 ఫీజు చెల్లించాడు. బుధవారం మరో రూ.వెయ్యి చెల్లించి హాల్‌టికెట్టు తీసుకోవడానికి కళాశాలకు వచ్చాడు. రూ.200 చెల్లిస్తే కళాశాల వార్షికోత్సవానికి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో వార్షికోత్సవానికి వెళ్లలేక బయట తిరుగుతూ ఉన్నాడు. గురువారం వచ్చి రూ.1,500 చెల్లించి హాల్‌టికెట్టు తీసుకుంటానని స్నేహితులకు చెప్పి బస్టాండులో బస్సు ఎక్కడానికి వెళుతున్నాడు. దీంతో ఒక్కసారిగా వాహనం రూపంలో వచ్చిన మృత్యువు అజయ్‌ను ఢీ కొట్టింది. రక్తస్రావం మధ్య అజయ్‌ను స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా. ‘ నేను బతుకుతానా..? మా అమ్మను చూడాలి...’ అంటూనే కళ్లుమూశాడు. ఆస్పత్రిలో నిర్జీవంగా పడివున్న అజయ్ మృతదేహాన్ని చూసిన ఇతని తల్లి గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కలచివేసింది.

ఇక చిత్తూరు గ్రామీణ మండలం మర్రికుంటకు చెందిన నాగరత్నరాజు, రత్నమ్మ రెండో కుమార్తె హంస (21) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తాను.. తన చదువు.. కొందరు స్నేహితులు తప్ప హంసకు మరే ప్రపంచం తెలియదు. నెల రోజులుగా జ్వరంతో కళాశాలకు వెళ్లని హంస బుధవారం  కళాశాకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరుపతిలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతోందని తెలుసుకుని అక్కడి వెళ్లి ఇంటర్య్వూకు హాజరయ్యి చిత్తూరుకు చేరుకుంది. స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తూ వ్యాన్ కింద పడి అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. ‘ ఇన్ని రోజులూ ఇంటి దగ్గరే ఉండి ఈ రోజనంగా కాలేజీకని చెప్పి మమ్మల్ని వదిలివెళ్లిపోయావా చెల్లీ...’ అంటూ మృతురాలి అక్క గీత,  ‘నెల రోజుల్లో పెళ్లి పందిరి ఎక్కాల్సిన దానివి పాడె ఎక్కావమ్మా...?’ అంటూ మృతురాలి తండ్రి నాగరత్నరాజు ఆర్తనాదాలు చూస్తూ గుండెలు అవిసేలా రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది.

రోడ్డు ప్రమాదం దోషులు పోలీసులే

ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడిపింది గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ.పురుషోత్తం. విషయాన్ని బుధవారం రాత్రి వరకు పోలీసుశాఖ గోప్యంగా ఉచింది. అప్పటికే విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహనం నడిపిన పురుషోత్తంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన కేఏ 01-బీ 2141 వాహనం ఎర్రచందం తరలించే దొంగల నుంచి సీజ్ చేసిందని కొందరు, రికార్డులు సరిగా లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారని మరికొందరు చెప్పుకుంటున్నారు. పోలీసు స్టేషన్‌లో నెలల తరబడి కండిషన్‌లో లేనివాహనాన్ని కానిస్టేబుల్ పురుషోత్తంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వశనీయంగా తెలిసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడానికి తూర్పు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని, వాహనం పోలీసు స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి విచారణ అధికారిగా ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాస్ పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఉన్న హసం, అజయ్ కుటుంబీకులను ఓదార్చారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అవసరమైతే వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు తరలించి చికిత్స డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.1.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే సత్యప్రభ చేతులుమీదుగా అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement