ఆ ఇద్దరు ఎవరు..!
*వారి సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు?
*పెట్రోలు క్యాన్‌లతోసహా దొరికినా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?
* విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి?
* హాట్‌టాపిక్‌గా మారిన పొలాల్లో చిచ్చు నిందితుల వ్యవహారం
* హైదరాబాద్ స్థాయి ఒత్తిళ్ళవల్లే బయటపెట్టడం లేదనే అనుమానాలు
* అసలు దోషుల్ని బయటపెట్టాలంటూ రైతుల రాస్తారోకో
గుంటూరు: రాజధాని ప్రాంతంలోని ఆరు గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో కార్చిచ్చు రేపిన దుర్ఘటనలో పెట్రోలు క్యాన్‌లతో సహా ఇద్దరు నిందితులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సంఘటనా స్థలాలను పరిశీలించిన ఐజీ పీవీ సునీల్‌కుమార్ పలుమార్లు స్వయంగా వల ముక్కలకు నిప్పంటించి చూశారు.
మామూలుగా అంటుకోకపోవడంతో కచ్చితంగా పెట్రోలుపోసి నిప్పంటించి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే సోమవారం రాత్రి పోలీసులకు దొరికిన ఆ ఇద్దరే ఈ సంఘటనలకు పాల్పడి ఉంటారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు కావస్తున్నా వారు ఎక్కడ ఉన్నారు..? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి..? అసలు ఆ ఇద్దరి గురించి పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు రావడం వల్లే ఆ ఇద్దరినీ ఎవ్వరి కంటపడకుండా గోప్యంగా ఉంచారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ ఇద్దరు చెప్పిన విషయాలు బయటకు వస్తే రాష్ట్రస్థాయిలో తీవ్ర కలకలం రేగుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటనకు పాల్పడిన తీరును బట్టి చూస్తే ఇది సైకోల పనిలా ఉందంటూ పోలీస్ ఉన్నతాధికారులు కేసును తప్పుదోవ పట్టించేందుకు పథక రచన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్షపాతంగా దర్యాప్తుచేసి అసలైన నిందితులను పట్టుకుని ఈ సంఘటన వెనుక ఉన్న అసలైన సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
బాధితులకు మంత్రి నారాయణ పరామర్శ
తుళ్లూరు: మండలంలోని లింగాయపాలెం, రాయపూడి, మందడం గ్రామాల్లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోరుున రైతులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని చెప్పారు. పొలాల్లో నిప్పు పెట్టిన ఘటన ఉన్మాద చర్యలా కనిపిస్తోందన్నారు. బాధ్యులెవరో త్వరలో తేలుతుందని చెప్పారు.