బాహుబలి..మైండ్‘బ్లాక్’!
రూ.రెండువేలకు చేరిన టికెట్ ధర
మల్టీప్లక్స్ థియేటర్లలో ‘కాంబో’ బాదుడు
చేతివాటం చూపిస్తున్న నాయకుల అనుచరులు
పట్టించుకోని అధికార గణం
విజయవాడ : భారీ అంచనాలతో ఈ నెల 10న విడుదల కాబోతున్న బాహుబలి చిత్రం టికెట్లకు యమ క్రేజ్ వచ్చింది. నగరంలో ఆ సినిమాకు టిక్కెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో దాన్ని థియేటర్ యాజమాన్యాలు కూడా అందినకాడికి ప్రేక్షకులను దోచుకుంటున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు రాజకీయ నాయకుల అనుయాయులు కూడా గుత్తగా టికెట్లు తీసుకుని సగం టికెట్లు కార్యకర్తలకు ఇచ్చి, మిగిలిన వాటిని బ్లాకులో అమ్ముకుంటున్నారు. మాల్స్‌లో మాల్స్‌లో ఉన్న మల్టీప్లక్స్ థియేటర్లతో పాటు నగరంలో ప్రముఖ సినిమా హాళ్ల వద్ద యథేచ్ఛగా బ్లాకులో టిక్కెట్లు విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల వరకు హౌస్ ఫుల్ అంటూ థియేటర్ల వద్ద ప్రచారం చేస్తూనే, మరోవైపు బ్లాక్‌లో అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. నగరంలో మంగళవారం నుంచే బ్లాకులో టికెట్ల విక్రయాలు మెదలయ్యాయి. దాదాపు పేరున్న 15 థియేటర్లకు జనం ఎగబడుతున్నారు. ఆయా థియేటర్లలో ఇప్పటికే ఒక్కో టికెట్‌ను రూ.వెయ్యి నుంచి, రూ.రెండు వేల వరకు బ్లాకులో విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు.
కాంబో టికెట్లు అంటగడుతున్న వైనం..
మల్టీప్లక్స్ థియేటర్లలో బాహుబలి చిత్రానికి కాంబో టిక్కెట్లు అంటగడుతున్నారు. ఒక థియేటర్‌లో రూ. 125 టికెట్ ధర ఉండగా కాంబో టికెట్ అంటూ రూ.200 వసూలు చేస్తున్నారు. కాంబో టికెట్‌కు రూ. 15లు విలువ చేసే ఒక కోకో కోలా, పాప్‌కార్న్ ప్యాకెట్ ఇస్తున్నారు. అదేమని అడిగితే థియేటర్ బుకింగ్ సిబ్బంది కాంబో టికెట్ కొంటేనే బాహుబలి టికెట్ ఇస్తామంటున్నారని సినీ ప్రేక్షకులు ఫిర్యాదు చేస్తున్నారు. కాంబోటికెట్‌పై జరిగే విక్రయాలకు సంబంధించి వాణిజ్యపన్నుల శాఖకు పన్ను కూడా ఎగనామం పెడుతున్నారు. కాగా నగరంలో విచ్చలవిడిగా థియేటర్ల వద్దే బ్లాకులో టికెట్లు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని అభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ యంత్రాంగం జోక్యం చేసుకుని బ్లాకులో టికెట్లు, కాంబో టికెట్ల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.