చిత్తూరు అగ్రికల్చర్: రెండు వేల నోటు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పాత నోట్ల రద్దు తర్వాత కనిపించిన ఈ నోటు రానురానూ అదృశ్యమవుతోంది. బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకుంటే రూ. 100 నోట్లను మాత్రమే చేతికిస్తున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఈ నోట్లనే తీసుకోవాల్సి వస్తోంది. పెద్ద నోట్లు ఇచ్చే పరిస్థితి బ్యాంకుల్లో ప్రస్తుతం లేదు. జిల్లాలో 39 బ్యాంకులకు చెందిన 618 బ్రాంచిలున్నాయి. రోజూ దాదాపు రూ. 30 కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటీఎంల ద్వారా మరో రూ. 10 కోట్లకు పైబడి ఖాతాదారులు తీసుకుంటున్నారు. ఏటీఎంల నుంచి తీసుకోవాలంటే పరిమితి పెట్టారు. దీంతో పెద్దమొత్తంలో నగదు కావాల్సిన ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సిందే.
బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కువగా వంద నోట్లే ఇస్తున్నారు. కాకుంటే రూ.200 నోట్లు ఇస్తున్నారు. దీంతో వీటిని తీసుకువెళ్లడం సమస్యగా మారింది. నోట్ల కట్టల భద్రత విషయంలోనూ ఆందోళన చెందుతున్నారు. ఆర్‌బీ నుంచి రూ.2 వేల నోట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలిసింది. రూ.500 నోట్లు కూడా రావడం తగ్గిపోయింది. కొద్దో గొప్పో ఉన్నా అవి ఏటీఎంల ద్వారా మాత్రమే పొందే వీలుంది.
ముద్రణ నిలిపివేత
పది నెలల క్రితమే రూ.2 వేల నోట్ల ముద్రణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రూ. 500 నోట్ల సరఫరాను కూడా పూర్తిగా తగ్గించినట్లు తెలిసింది. రూ.500 నోట్లు ఏటీఎంలకు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2 వేల నోట్లు నల్లకుబేరులకు వరంలా పరిణమించింది. విడుదలైన కొన్నాళ్లు మాత్రమే జనం చేతుల్లో చెలామణి అయింది. కొద్దికాలంలోనే పెద్దనోటు వాడకం తగ్గిపోయింది. సంపన్నవర్గాల చేతిలో ఇవి చిక్కుకున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు నోట్ల కష్టాలు మళ్లీ దాపురించాయి.
చిన్న మొత్తాలు తీసుకెళ్లాలన్నా ఇబ్బందే
పెద్ద నోట్లు సరఫరా నిలిచిపోవడంతో చిన్న మొత్తాలను తీసుకెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. బ్యాంకులో రూ. 10 వేలు డ్రా చేసినా చేతికి చిన్ననోట్ల కట్టలు అందిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుంటే ముందస్తుగా సంచులు తీసుకెళ్లాల్సి వస్తోంది.
– గురునాథరెడ్డి, కృష్ణంపల్లె
ఏటీఎంలో రూ.500 మాత్రమే వస్తున్నాయి
రూ. 500 నోట్లు ఏటీఎంలలో మాత్రమే వస్తున్నాయి. బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటే కేవలం రూ. 100 నోట్లు మాత్రమే చేతికిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకున్నా రూ.2 వేల నోట్లు ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులను నుంచి నగదు తీసుకురావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– కారేటి గోవిందరెడ్డి, పెనుమూరు
ఉన్న 2వేల నోట్లే చెలామణి అవుతున్నాయి
కొత్తగా ఆర్‌బీఐ నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు. ఉన్న నోట్లే చెలామణి అవుతున్నాయి. ప్రస్తుతం 500, 200, 100 రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి.
– లక్ష్మీ నారాయణ, జోనల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్
Comments
Please login to add a commentAdd a comment