
సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమడోలు: ప్రభుత్వ అధికారులపై దాడులకు, వివాదాలకు మారుపేరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు బుధవారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500లు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు.