vatti vasantha kumar
-
రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి..
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వంలో రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు చేపట్టారని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పారదర్శకత లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్‌పై జరుగుతున్న అన్ని పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విచారణ కోసం కమిటీ నియమించిన ఎన్జీటీ, నెల రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. 2015లో పట్టిసీమ, చింతలపాడుతోపాటు అక్రమ ప్రాజెక్టులపై హై కోర్టును ఆశ్రయించినా, చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కదా హియరింగ్‌కు కూడా రాలేదని మండిపడ్డారు. గత్యంతరం లేక ఏన్‌జీటీని ఆశ్రయించానన్నారు. నదుల అనుసంధానం విషయంలో అంతర్ రాష్ట్రాల నుంచి అనుమతులు, పరిరక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. 2018లో పెన్నా-గోదావరి అనుసంధానం విషయంలో పోలవరం, గోదావరి ప్రాజెక్ట్ అథారిటీల అనుమతులు పొందలేదని తెలిపారు. డెల్టా ప్రాంత రైతుగా కోర్టును ఆశ్రయించానని, చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులు బచావత్ ట్రిబ్యునల్ నిర్ధేశానికి పూర్తి విరుద్ధమన్నారు. టీడీపీ ప్రభుత్వం డెల్టా రైతుల జీవితాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలు పాటించాలని కోరారు. -
11 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా: మాజీ మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి : నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసిస్తున్న టీడీపీతో పొత్తుపెట్టుకోవడం సహించలేకనే పార్టీకి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. ఈనెల 11 తర్వాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆయన భీమడోలు మండలం పూళ్లలో సోమవారం అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వసంతకుమార్ మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను తెలపడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. గత మార్చిలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లీనరీలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు తన అనుచరులను ఐటీ దాడులు నుంచి కాపాడుకునేందుకే బీజేపీపై పోరాటం చేస్తున్నాడని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 11 తరువాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్‌తో ఉండేది లేదని, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీతో వెళ్ళేది లేదని ఆయన తేల్చిచెప్పారు. -
‘అధిష్టానానికి చంద్రబాబుతో జాగ్రత్త అని చెప్పాం’
సాక్షి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాదని, జాగ్రతగా ఉండాలని అధిష్టానాన్ని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జతకట్టే ప్రసక్తే లేదని వట్టి వసంతకుమార్ స్పష్టం చేశారు. పోలవరం, పట్టిసీమతో పాటు ఇతర పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్లీనరీలోనే తొలిసారిగా తీర్మానించామని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి రెండేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమడోలు: ప్రభుత్వ అధికారులపై దాడులకు, వివాదాలకు మారుపేరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు బుధవారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500లు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. -
ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్ల జైలుశిక్ష
-
ఎమ్మెల్యే చింతమనేనికి జైలుశిక్ష
సాక్షి, దెందులూరు : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు. అంతే కాకుండా వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్‌పై చేయిచేసుకున్న కేసులో దోషిగా నిర్ణయిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. 2011 జూన్ నెలలో దెందులూరు హైస్కూల్ లో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్ పై దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని దౌర్జన్యం చేయడంతో పాటు అప్పటి ఎంపి కావూరి సాంబశివరావు , ప్రజలందరి సమక్షంలో చేయి చేసుకున్నారు. దీనిపై అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్ ఫిర్యాదు మేరకు దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు నాలుగు సెక్షన్లగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లగా కేసు వాదోపవాదనలు జరగగా నేడు (బుధవారం) కోర్టు తీర్పు వెలువరించింది. సెక్షన్ 506(2) గా రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయిల జరిమానా....సెక్షన్ 353 గా ఆరు నెలల జైలు శిక్ష, వేయి రూపాయిల జరిమానా, సెక్షన్ 7(1) గా ఆరు నెలలు జైలు శిక్ష తో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. మొత్తంగా మూడేళ్ల జైలు శిక్ష, 2500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పునివ్వడంతో చింతమనేనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష వర్తిస్తుంది. తీర్పు వెలువడే సమయంలో తన అనుచరులతో చింతమనేని కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చింతమనేని బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
వట్టి వసంత్‌కుమార్‌కు సతీవియోగం
సాక్షి, తాడేపల్లిగూడెం: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ భార్య ఉమాదేవి కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు. శనివారం స్వగ్రామం భీమడోలు మండలం ఎంఎం పురంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
విడిపోతే సీమాంధ్రకు తీవ్ర నష్టం: వట్టి
ప్యాకేజీలు లేవు.. ఆర్థికసాయమూ లేదు.. సాక్షి, హైదరాబాద్: తమకు ప్యాకేజీలు లేవని, ఆర్థిక సహాయమూ లేదంటూ.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతమైన సీమాంధ్ర అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోతుందని పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర కేవలం వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అరుునందువల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దీని చుట్టూ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెలిశాయని చెప్పారు. రాష్ర్ట ఐటీ రంగంలో 99.97 శాతం హైదరాబాద్ చుట్టూనే ఉందన్నారు. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత తమను ఇక్కణ్ణుంచి వెళ్లిపొమ్మనడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ-2013 బిల్లుపై గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ‘కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలి? అందుకు అయ్యే నిధులు ఎక్కడినుంచి వస్తాయి? సంబంధిత సమాచారం బిల్లులో లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. విడిపోవడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి నిధుల కొరత ఏర్పడుతుంది. జీతాలు, పింఛన్లను ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఆంధ్రా ప్రాంతం కంటే తెలంగాణాలోనే ఎక్కువ అభివృద్ధి ఉంది. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ఈ విషయమే స్పష్టం చేసింది. ఉన్నత విద్యా సంస్థలతో పాటు, కేంద్ర పరిశోధనా కేంద్రాలు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారుు. ఐటీఐఆర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు’ అని వట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తే హెలికాప్టర్‌ను పేల్చివేస్తామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని, తెలంగాణ జాగృతి నేత కవిత వ్యాఖ్యల్ని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. అసలెందుకు విభజిస్తున్నారో చెప్పలేదు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలన్నిటి నీ ఉల్లంఘించారని వట్టి విమర్శించారు. ‘రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో చెప్పలేదు.. విభజన కోరుతూ రాష్ట్ర తీర్మానం లేదు.. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో రాష్ట్రాల విభజన జరిగిన సందర్భాల్లో దానికి ఆయా రాష్ట్రాల ఆమోదం ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ వంటి వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సభ్యుల మనోభావాల ప్రకారం ఆ నిర్ణయాన్ని మార్చుకునేవారు. ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పునరాలోచించాలి. విభజనతో నీటి సమస్యలు మరింత రెట్టింపవుతారుు’ అని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రాంతం వారిని దోపిడీ దారులుగా పేర్కొడం మానేయాలని సూచించారు. -
రాజకీయ క్రీడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘జరిగిపోయిన పెళ్లికి బాజా వాయించడం’లోని అనౌచిత్యం చిన్నపిల్లలకైనా తడుతుంది. అయితే అలాంటి ఉచితానుచితాల పట్టింపు అటు అమాత్యులకూ, ఇటు అధికారులకూ లేనట్టుంది. అందుకే కాకినాడలోని జిల్లా క్రీడామైదానంలో రెండు నెలల క్రితమే మొదలైన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన తతంగాన్ని నిర్వహించారు. మైదానంలో రూ.1.54 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.70 కోట్లతో జిమ్నాస్టిక్స్ హాలు, రూ.65 లక్షలతో టీటీ హాలు, రూ.74 లక్షలతో అకామడేషన్ హాలు, రూ.44 లక్షలతో సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ.32 లక్షలతో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, రూ.15 లక్షలతో రెండు గేట్లు, రూ.17 లక్షలతో ప్రహారీ, రూ.11 లక్షలతో మరమ్మతు పనులు రెండు నెలలుగా జరుగుతున్నాయి. డిసెంబరు చివర్లో రాష్ట్ర పర్యాటక, క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పనులను పర్యవేక్షించి వెళ్లారు. అలాంటి పనులకు ఇప్పుడు శంకుస్థాపన అంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం ఆదివారం హడావిడి చేయడం విమర్శలకు తావిచ్చింది. జరుగుతున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే వాదన వినిపిస్తోంది. జిల్లా క్రీడామైదానం కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలందుతున్న నేపథ్యంలో రూ.5.86 కోట్లతో క్రీడాభివృద్ధికి తన హయాంలోనే శ్రీకారం చుట్టానని చెప్పుకోవాలన్న తాపత్రయంతోనే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కె.కన్నబాబు ప్రోద్బలంతో జరుగుతున్న పనులకే శంకుస్థాపన అంటూ హడావిడి చేశారని క్రీడాకారులు పేర్కొంటున్నారు. పనులు చేపట్టిన నాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయని అధికారులు ఇప్పుడు చేయడంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.