విడిపోతే సీమాంధ్రకు తీవ్ర నష్టం: వట్టి
ప్యాకేజీలు లేవు.. ఆర్థికసాయమూ లేదు..
సాక్షి, హైదరాబాద్: తమకు ప్యాకేజీలు లేవని, ఆర్థిక సహాయమూ లేదంటూ.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతమైన సీమాంధ్ర అనేక రంగాల్లో తీవ్రంగా నష్టపోతుందని పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర కేవలం వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అరుునందువల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దీని చుట్టూ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వెలిశాయని చెప్పారు.
రాష్ర్ట ఐటీ రంగంలో 99.97 శాతం హైదరాబాద్ చుట్టూనే ఉందన్నారు. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత తమను ఇక్కణ్ణుంచి వెళ్లిపొమ్మనడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ-2013 బిల్లుపై గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ‘కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలి? అందుకు అయ్యే నిధులు ఎక్కడినుంచి వస్తాయి? సంబంధిత సమాచారం బిల్లులో లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. విడిపోవడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి నిధుల కొరత ఏర్పడుతుంది. జీతాలు, పింఛన్లను ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఆంధ్రా ప్రాంతం కంటే తెలంగాణాలోనే ఎక్కువ అభివృద్ధి ఉంది. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ఈ విషయమే స్పష్టం చేసింది. ఉన్నత విద్యా సంస్థలతో పాటు, కేంద్ర పరిశోధనా కేంద్రాలు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారుు. ఐటీఐఆర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు’ అని వట్టి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తే హెలికాప్టర్‌ను పేల్చివేస్తామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని, తెలంగాణ జాగృతి నేత కవిత వ్యాఖ్యల్ని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు.
అసలెందుకు విభజిస్తున్నారో చెప్పలేదు..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలన్నిటి నీ ఉల్లంఘించారని వట్టి విమర్శించారు. ‘రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో చెప్పలేదు.. విభజన కోరుతూ రాష్ట్ర తీర్మానం లేదు.. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో రాష్ట్రాల విభజన జరిగిన సందర్భాల్లో దానికి ఆయా రాష్ట్రాల ఆమోదం ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ వంటి వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సభ్యుల మనోభావాల ప్రకారం ఆ నిర్ణయాన్ని మార్చుకునేవారు. ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పునరాలోచించాలి. విభజనతో నీటి సమస్యలు మరింత రెట్టింపవుతారుు’ అని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రాంతం వారిని దోపిడీ దారులుగా పేర్కొడం మానేయాలని సూచించారు.