సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘జరిగిపోయిన పెళ్లికి బాజా వాయించడం’లోని అనౌచిత్యం చిన్నపిల్లలకైనా తడుతుంది. అయితే అలాంటి ఉచితానుచితాల పట్టింపు అటు అమాత్యులకూ, ఇటు అధికారులకూ లేనట్టుంది. అందుకే కాకినాడలోని జిల్లా క్రీడామైదానంలో రెండు నెలల క్రితమే మొదలైన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన తతంగాన్ని నిర్వహించారు. మైదానంలో రూ.1.54 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.70 కోట్లతో జిమ్నాస్టిక్స్ హాలు, రూ.65 లక్షలతో టీటీ హాలు, రూ.74 లక్షలతో అకామడేషన్ హాలు, రూ.44 లక్షలతో సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ.32 లక్షలతో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, రూ.15 లక్షలతో రెండు గేట్లు, రూ.17 లక్షలతో ప్రహారీ, రూ.11 లక్షలతో మరమ్మతు పనులు రెండు నెలలుగా జరుగుతున్నాయి.
డిసెంబరు చివర్లో రాష్ట్ర పర్యాటక, క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పనులను పర్యవేక్షించి వెళ్లారు. అలాంటి పనులకు ఇప్పుడు శంకుస్థాపన అంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం ఆదివారం హడావిడి చేయడం విమర్శలకు తావిచ్చింది. జరుగుతున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే వాదన వినిపిస్తోంది. జిల్లా క్రీడామైదానం కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలందుతున్న నేపథ్యంలో రూ.5.86 కోట్లతో క్రీడాభివృద్ధికి తన హయాంలోనే శ్రీకారం చుట్టానని చెప్పుకోవాలన్న తాపత్రయంతోనే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కె.కన్నబాబు ప్రోద్బలంతో జరుగుతున్న పనులకే శంకుస్థాపన అంటూ హడావిడి చేశారని క్రీడాకారులు పేర్కొంటున్నారు. పనులు చేపట్టిన నాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయని అధికారులు ఇప్పుడు చేయడంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ క్రీడ
Published Mon, Jan 6 2014 12:39 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement
Advertisement