సాక్షి, పశ్చిమ గోదావరి : నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసిస్తున్న టీడీపీతో పొత్తుపెట్టుకోవడం సహించలేకనే పార్టీకి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. ఈనెల 11 తర్వాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆయన భీమడోలు మండలం పూళ్లలో సోమవారం అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వసంతకుమార్ మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను తెలపడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు.
గత మార్చిలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లీనరీలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీ కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు తన అనుచరులను ఐటీ దాడులు నుంచి కాపాడుకునేందుకే బీజేపీపై పోరాటం చేస్తున్నాడని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 11 తరువాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్‌తో ఉండేది లేదని, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీతో వెళ్ళేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment