తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో నిరాశ నింపాయి. పొత్తు వల్లేనష్టపోయామంటూ ఇరుపక్షాల నేతలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లగడపాటి సర్వే టీడీపీ నేతలు, కార్యకర్తలు, బెట్టింగ్ రాయుళ్లను నట్టేట ముంచింది. ఆ సర్వేనునమ్మిన వారు రూ.కోట్లలో పందేలు కాసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మొదటి నుంచి తెలుగు దేశంతో పొత్తును వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీతో కలవడం వల్లే తెలంగాణలో ఘోర పరాజయం పాలయ్యామని, లేకుంటే 40
స్థానాలకు పైగా సాధించేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గతంలో వచ్చిన ఓటింగ్ శాతం కూడా రాదని చెబుతున్నారు. 2014లో ఏకపక్షంగా రాష్ట్రాన్ని
విభజించినందుకు ఇప్పటివరకూ నష్టపోయామని, ఇప్పుడిప్పుడే ప్రజల వద్దకు వెళ్లి పుంజుకుంటున్నామన్న తరుణంలో ఈ పరిణామం పార్టీకి ఇంకా ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
టీడీపీదీ అదే బాధ.. మరోవైపు తెలుగుదేశం నాయకులు కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్లే తాము నష్టపోయామని, విడిగా ఒంటరిగా పోటీ చేసినా గౌరవప్రదంగా ఉండేదని భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం తమపై పడుతుందన్న భావన వారిలో కనపడుతోంది. అక్కడ టీఆర్‌ఎస్ పాజిటివ్ ఓటుతో గెలిస్తే తాము నెగిటివ్ ఓటుతో పరాజయం పాలవుతామన్న ఆందోళన తెలుగుదేశం నాయకుల్లో కనపడుతోంది. ఎక్కడ ఏ ఇద్దరు తెలుగుదేశం నాయకులు కలిసినా వారి మధ్య ఇదే చర్చ జరిగింది. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తమ పార్టీ పుట్టిందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించడం లేదని తెలంగాణలో స్పష్టమైందని పేర్కొంటున్నారు. ఇది తమ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదమేనని అంగీకరిస్తున్నారు. అక్కడ తెలంగాణ ఇచ్చిన సానుభూతి ఉన్నా కాంగ్రెస్‌ను గెలిపించలేదని, ఇక్కడ రాష్ట్రాన్ని విడదీశారన్న కోపంతో ఉన్న తరుణంలో ఈ పొత్తు తమ పార్టీకి ఇంకా నష్టం చేస్తుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా కూకట్‌పల్లిలో నందమూరి హరికృష్ణ కుమార్తె పరాజయాన్ని దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. అనవసరంగా నందమూరి కుటుంబాన్ని వీధులపాలు చేసినట్టయిందని భావిస్తున్నారు. కూకట్‌పల్లి గెలుపుకోసం జిల్లా నుంచి ఒక సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి అక్కడ మకాం వేసి డబ్బులు ఖర్చు పెట్టినా 40 వేలకు పైగా తేడాతో హరికృష్ణ కుమార్తె ఓటమి పాలు కావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుహాసిని కుటుంబానికి ఇక్కడ సీటు ఇవ్వకుండా తెలంగాణలో ఇచ్చి ఓడించారని ఓ వర్గం నేతలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చేస్తున్న హడావుడి ఇంకా శత్రువులను పెంచుతుందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వేలుపెట్టి మరోసారి ఎదురుదెబ్బ తినాల్సి వస్తుందేమోనని, ముప్పేట దాడితో తమ పార్టీ మనుగడ కోల్పోతుందేమోనని మదనపడుతున్నారు. డబ్బుతో ఏమైనా చేయవచ్చనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్న ఆందోళన అధికార పార్టీలో కనపడుతోంది.
ఆయన దగాపాటి
మరోవైపు లగడపాటి జోస్యాన్ని నమ్మి, ఆంధ్రా లో, ముఖ్యంగా మన జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, బెట్టింగ్ రాయుళ్లు రూ.కోట్లలో బెట్టింగ్ కాశారు. ముఖ్యంగా ఒక సామాజికవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కూటమి గెలుపుపై పందేలు వేశారు. ఇప్పు డు ఎన్నికల ఫలితాలు వారి జేబులను గుల్లచేయడంతో లగడపాటిపై ఆ వర్గం గుర్రుగా ఉంది. ఆయన లగడపాటి కాదని.. దగాపాటి అని విమర్శిస్తున్నారు.
టీడీపీ పొత్తుతోనే ఓటమి..
మూడు రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ హవా కొనసాగింది. మూడు రాష్ట్రాల్లోనూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ మూడు రాష్ట్రాల్లో కంటే ముందుగా తెలంగాణలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కోలుకోలేని దెబ్బ తగిలిందని భావిస్తున్నాం. అప్పటికే సీనియర్ నేతలు చెబుతున్న అధిష్టానం పట్టించుకోలేదు.
– జ్యేష్ఠ సతీష్‌బాబు, పీసీసీ కార్యదర్శి
చంద్రబాబును తిరస్కరించారు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గెలుపొందిన రాష్ట్రంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేయడం మానేసి పక్క రాష్ట్రాల్లో ప్రజల పక్షాన మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది. తెలంగాణ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన్నట్టు స్పష్టమవుతోంది. దేశంలో జరుగుతున్న ఎన్నికలు మొత్తం డబ్బులు, ప్రలోభాల మధ్య నడుస్తున్నాయి. దాని ప్రభావంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.
– పి.కిషోర్, సీపీఎం నగర కార్యదర్శి
బాబు ప్రచారం వల్లే ఓటమి
చంద్రబాబు చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని ఎన్నికల ఫలితాల్లో నిరూపితమైంది. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానంటూ ప్రచారం చేసిన చంద్రబాబుకు చేదు అనుభవం మిగిలింది. 2019 ఏపీ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు పరాజయం తప్పదు.– తెల్లం బాలరాజు,వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment