అమరచింత/ధరూరు, న్యూస్‌లైన్: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. మరో సంఘటనలో జాతర ఉత్సవాలకు వెళ్తున్న బాలికపై కొందరు లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటనలు జిల్లాలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.
బాధితులు, పోలీసుల కథనం మేరకు.. అమరచింత గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రప్ప తండాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెలు(ఇద్దరు మైనర్లు) ఇంటివద్దే దీపావళి సంబరాలను జరుపుకున్న అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. దీనిని గమనించిన రవినాయక్, మరో యువకుడు రవి వారిని వెంబడించారు. అక్కపై రవినాయక్, చెల్లెలుపై రవి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేకలు వేయడంతో చంపేస్తామని బెదిరించారు. తమపై జరిగిన దారుణాన్ని ఆ బాలికలు తల్లిదండ్రులకు వివరించారు. సోమవారం ఉదయం చంద్రప్ప తండాలో పంచాయితీ ఏర్పాటు చేసి ఇరువురి కుటుంబాలను పిలిపించారు. కట్నం కింద నగదు, బంగారం ఇవ్వాలని ఆ యువకుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని బాలికల తల్లిదండ్రులు చెప్పడంతో పెళ్లిచేసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయం ఆత్మకూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
జాతరకు వెళ్తున్న బాలికపై..
ధరూరు మండలంలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన ఓ బాలిక(15) పొరుగు ఊరు వెంకటాపురంలో సోమవారం సాయంత్రం జరిగిన శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమానికి ఆటోలో స్నేహితులతో కలిసి బయలుదేరి వెళ్లింది. గ్రామం నుంచి కొందరు యువకులు ఆమెను ఆటోలో వెంబడించారు. బ్రహ్మోత్సవాలకు సమీప ప్రాంతంలో వెంకటాపురం గ్రామానికి చెందిన రఘు, రవి, జమ్మన్న, గురుస్వామి, తిరుమలేష్‌లు అనే యువకులు బాలికపై అసభ్యంగా ప్రవర్తించారు.
పక్కనే ఉన్న ఆమె చిన్నాన్న ఆ యువకులను మందలించాడు. గొడవ జరగడంతో అక్కడున్న జనం వారిని వారించి ఎక్కడి వారిని అక్కడ పంపించారు. ఇదిలాఉండగా జరిగిన ఉదంతాన్ని మంగళవారం ఉదయం రేవులపల్లి పోలీసులకు వివరించారు. తనపై జరిగిన లైంగికదాడికి పాల్పడిన యువకులపై చర్యతీసుకోవాలని సదరు బాలిక రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంగళవారం రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలి బంధువులు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నపాడు ఆంజనేయులు, నాయకులు హన్మంతు, డ్యాం వెంకటన్నలు పోలీస్‌స్టేషన్ ఎదుటే మౌనదీక్షకు పూనుకున్నారు. నిందితులపై నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసునమోదుచేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.
దారుణం
Published Wed, Nov 6 2013 3:20 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement