నిందితుల్లో అధికార పార్టీ కౌన్సిలర్ ?
తాడేపల్లి రూరల్: పూజలకోసం వచ్చిన మహిళలపట్ల మద్యం సేవించిన యువకులు అసభ్యంగా ప్రవర్తించడమేగాకుండా వారిపై లైంగికదాడికి యత్నించిన సంఘటన తాడేపల్లి మండలం సీతానగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ బీటుకానిస్టేబుళ్లు వారిని రక్షించారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి గంగానమ్మపేటకు చెందిన మనుగోలు వర్మ వదినకు కొద్దికాలం నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. స్థానిక గంగానమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఆలయ పూజారి సలహా మేరకు పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలిపేందుకు ఆదివారం రాత్రి వర్మ కుటుంబ సభ్యులు ఏడుగురు తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పెద ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చారు.
పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలుపుతుండగా అక్కడికి సమీపంలో ఇసుక తిన్నెలపై మద్యం సేవిస్తున్న మందుబాబుల దృష్టి మహిళలపై పడింది. ముగ్గురు మహిళలపై వారు విచక్షణ కోల్పోయి వయసు కూడా చూడకుండా లైంగిక దాడికి యత్నించారు. వారితో వచ్చిన పురుషులు కూడా అడ్డుకోలేకపోయారు. అటుగా వస్తున్న బీటు కానిస్టేబుళ్లు వీరి కేకలు విని అక్కడకు వెళ్లి మహిళలను రక్షించారు.
ఈ మేరకు బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుబాబులు తమ వద్ద నుంచి 17 వేల రూపాయల నగదు, మూడు సవర్ల నానుతాడు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకాలంలో పోలీసులు రాకపోతే బంధువుల ఎదుటే తమపై లైంగికదాడి చేసి, హత్య చేసి ఉండేవారని రోదిస్తూ తెలిపారు. నిందుతుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్ కుమారుడని తెలియవచ్చింది.
పోలీసుల అదుపులో ఐదుగురు
ఈ సంఘటనపై ఎస్‌ఐ వినోద్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 333, 341, 323, 364, 356, 384, 149 ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో మహానాడుకు చెందిన అల్లాబక్షు, ఎ.స్వామి, అంజిరెడ్డి కాలనీకి చెందిన పద్మారవి, విజయవాడ గిరిపురానికి చెందిన ఖాజా, కత్తుల తులసీకృష్ణ ఉన్నారని చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
మహిళా భక్తులపై లైంగికదాడికి యత్నం
Published Tue, Jul 22 2014 2:40 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement