జిల్లాలో ఇప్పటి దాకా విద్యార్థులు లేని, పది మందిలోపు విద్యార్థులున్న 177 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్ :జిల్లాలో ఇప్పటి దాకా విద్యార్థులు లేని, పది మందిలోపు విద్యార్థులున్న 177 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలల వంతు వచ్చింది. జీఓ-5 అమలులో భాగంగా 6, 7 తరగతుల్లో 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయాలి. అక్కడ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు) మాత్రమే నిర్వహించాలి. ఆయా పాఠశాల్లోని 6,8 తరగతుల విద్యార్థులను సమీప హైస్కూళ్లకు సర్దుబాటు చేయాలి. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనరు ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 20లోపు విద్యార్థులున్న యూపీ స్కూళ్లు 225 ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితా కూడా రాష్ట్ర అధికారులే జిల్లాకు పంపారు. వీటన్నింటినీ రద్దు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. యూడైస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,869 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 2,441 పాఠశాలలు 6, 7 తరగతుల్లో 20 మందికి పైగా విద్యార్థులతో నడుస్తున్నాయి. 1,428 స్కూళ్లలో మాత్రం 20లోపు విద్యార్థులున్నట్లు గుర్తించారు. వీటిలోని 6, 7 తరగతుల విద్యార్థులను, పాఠశాల సహాయకులను సమీప పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రద్దవుతున్న స్కూళ్లు..
విడపనకల్లు మండలం తిమ్మాపురం, ఉరవకొండ మండలం లత్తవరం, ఆత్మకూరు మండలం పి. సిద్దరాంపురం, రొళ్ల మండలం ఆవినకుంట, సోమందేపల్లి మండలం నాగినాయినిచెరువు, బుక్కరాయసముద్రం మండలం వడియంపేట, హిందూపురం మండలం ఎస్.సోదలపల్లి, పుట్టపర్తి మండలం రెడ్డిచెరువుపల్లి యూపీ పాఠశాలలు రద్దుకానున్నాయి.
వజ్రకరూరుమండలంలో 5, గుంతకల్లు 4, గుత్తి 4, పెద్దవడగూరు 4, యాడికి 4, తాడిపత్రి 5, పెద్దపప్పూరు 6, శింగనమల 5, పామిడి 3, గార్లదిన్నె 3, బ్రహ్మసముద్రం 5, కుందుర్పి 4, కళ్యాణదుర్గం 4, అనంతపురం 3, నార్పల 4, పుట్లూరు 5, యల్లనూరు 5, తాడిమర్రి 5, బత్తలపల్లి 2, రాప్తాడు 2, కనగానపల్లి 7, కంబదూరు 4, రామగిరి 7, చెన్నేకొత్తపల్లి 7, ధర్మవరం 7, ముదిగుబ్బ 11, తలుపుల 6, నంబులపూలకుంట 9, తనకల్లు 8, నల్లచెరువు 4, గాండ్లపెంట 2, కదిరి 6, అమడగూరు 9, ఓబులదేవరచెరువు 6, నల్లమాడ 2, గోరంట్ల 6, బుక్కపట్నం 3, కొత్తచెరువు 4, రొద్దం 5, చిలమత్తూరు 8, లేపాక్షి 2, మడకశిర 3, అమరాపురం 4, ఆగళి మండలంలో 6 యూపీ స్కూళ్లు రద్దు కానున్నాయి.