
వేడుకగా ఉగాది పురస్కారాలు
- 32 మందికి కళారత్న, 67 మందికి ఉగాది పురస్కారాలు
- బాలాంత్రపు రజనీ కాంతారావుకు ‘తెలుగు వెలుగు’ పురస్కారం
సాక్షి, విజయవాడ బ్యూరో: మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మంది ప్రముఖులకు శనివారం ‘2015 కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను అందజేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావులు వీటిని అందజేశారు.
ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. అదేవిధంగా 32 మందికి హంస, మరో 67 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50 వేలు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు.