రాజధాని పేరుతో భయానకం సృష్టిస్తున్నారు: ఉమారెడ్డి
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని ఉమారెడ్డి సూచించారు. పంట భూములను తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ల్యాండ్ పూలింగ్ కు చట్ట బద్దత ఉందా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారని ఆయన తెలిపారు. భూ సేకరణ, సమీకరణలపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కఠిన చట్టాలు చేసిందని, ప్రభుత్వం కావాలంటే 70 శాతం మంది రైతులు ఒప్పుకోవాలని చట్టంలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిపై స్పష్టత లేకుండా ప్రతిరోజు ఓ గ్రామానికి వెళ్లి.. బెదిరింపులకు గురి చేయడం సరికాదు అని ఉమారెడ్డి అన్నారు. తుళ్లురు పరిసర గ్రామాల్లో నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారని ఉమారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.