అవినీతిపై చర్చకు ప్రభుత్వం పలాయనం
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాల్‌పై ప్రభుత్వం తోకముడిచింది.
ఉండవల్లిని అదుపులోకి తీసుకుని ఉయ్యూరుకు తరలించిన పోలీసులు
సాక్షి, విజయవాడ/ఉయ్యూరు/గన్నవరం: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాల్‌పై ప్రభుత్వం తోకముడిచింది. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బహిరంగచర్చకు వచ్చినట్లు డ్రామా నడిపి చివరకు పోలీసుల సాకుతో పలాయనం చిత్తగించారు. విజయవాడలో మంగళవారం హైడ్రామాకు తెరతీసిన ఈ ఉదంతం వివరాలు.. ప్రకాశం బ్యారేజ్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లికి గతంలో బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన ఉండవల్లి మంగళవారం ఉదయం 10.30 గంటలకు బ్యారేజ్ వద్దకు వచ్చే సరికే పోలీసులు ఆయన్ను అడ్డుకుని సెక్షన్ 30 అమలులో ఉన్నందున బ్యారేజ్ వద్దకు అనుమతించబోమని చెప్పి అదుపులోకి తీసుకుని ఉయ్యూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గన్నవరం వద్ద బుచ్చయ్య హైడ్రామా..
రాజమహేంద్రవరం నుంచి 30 కార్లలో వందమంది అనుచరులతో అట్టహాసంగా విజయవాడ బయలుదేరిన బుచ్చయ్యచౌదరిని ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సయమంలో ఆయన కారు దిగకుండానే హైడ్రామా నడిపారు. ఉండవల్లిని అదుపులోకి తీసుకున్నారని, చర్చ జరిగే అవకాశం లేదని పోలీసులు చెప్పిన తర్వాత.. విజయవాడకువెళ్లి ప్రెస్‌మీట్ పెట్టుకుంటానని చెప్పి బుచ్చయ్య అక్కడి నుంచి బయలుదేరారు.
ఇది దుష్ట సంప్రదాయం
ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఉండవల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను అరెస్టు చేయడం దుష్టసంప్రదాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య సవాల్‌ను స్వీకరించే తాను ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చానన్నారు. ఐదు రోజుల ముందే అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశానని తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఉండవల్లికి మద్దతుగా నిలిచారు.