
సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఉన్నత స్థానంలోకి వెళ్లినపుడు నాయకులు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని, ఆంధ్ర ప్రదేశ్‌లో అలా జరగడంలేదన్నారు. వ్యవస్థలపై ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విధానాలు కాకుండా, సొంత ఎజెండాలను ముందుకు తీసుకువెళుతున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు 58 శాతం పూర్తి అయ్యిందని చెబుతూనే మే నెలలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. పోలవరం పనులు ఎప్పుడెప్పుడు ఎలా జరిగాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సీపాల్టీల్లో 8 శాతం వడ్డీకి కమర్షియల్ బ్యాంకుల నుంచి 12,600 కోట్లు అప్పులు తెచ్చేందుకు జీవో విడుదల చేశారని, అయితే ఆఖరి 4 నెలల్లో ఎందుకు అప్పులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని మండిపడ్డారు. పోలవరానికి ప్రభుత్వం తరుపున బాధ్యత కలిగిన వ్యక్తిని పంపించాలన్నారు. తాను చేసిన ఆరోపణలు తప్పయితే తప్పుని ఒప్పుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment