శాంతించిన పాతాళగంగ
కృష్ణాజిల్లా కొణతనపాడులో బోరు నుంచి ఎగిసిపడుతున్న గంగమ్మ ఎట్టకేలకు శాంతించింది.గ్యాస్ నిక్షేపాల వల్లే జలం ఎగిసిపడిందంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ప్రొద్దుటూరుకు చెందిన రైతు బీహెచ్.గిరిరెడ్డి పంట పొలంలో బోరులోంచి శనివారం జలధార ఎగిసిన విషయం విదితమే. పొలంలో ఉన్న 40 అడుగుల లోతు బోరుకు నీరు అందక లోతు తీయించడంతో సుమారు 150 అడుగుల వద్ద జల వచ్చింది. ఇది 70 అడుగుల ఎత్తున ఎగిసిపడింది. ఈ జలధార ఆదివారం తెల్లవారుజాము రెండుగంటల వరకు కొనసాగింది. నీటితోపాటు బలమైన గాలి శబ్దం వస్తుండడంతో గ్యాస్ నిక్షేపం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాటికి తెరదించుతూ తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి తగ్గుతూ వచ్చింది.
నమూనాల సేకరణ: జలధార ఎగిసిపడుతున్న విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ బృందం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొణతనపాడు చేరింది. బోరు గొట్టం నుంచి వస్తున్న నీటి శ్యాంపిళ్లను సేకరించారు. ఆ సంస్థ రాజమండ్రి డీజీఎం గాజుల శ్రీహరి, జిల్లా నోడల్ అధికారి మురుగేశన్, ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి పొరల్లో ఉన్న గాలి.. ఒత్తిడితో నీటిని తోసుకుంటూ వస్తోందన్నారు.
-కంకిపాడు