వింటే భారతమే వినాలి.. కొంటే ప్రొద్దుటూరు బంగారన్నే కొనాలంటారు ఈ ప్రాంత వాసులు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. కచ్చితమైన ధర.. మగువలు మెచ్చేలా కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ప్రముఖ స్థానం పొందింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం పొద్దుటూరుకు వెళ్లాల్సిందే..
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ఈ ఊరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలిమందుకు ఆదరణ తగ్గింది. దీంతో వీరంతా ఏం చేస్తే బాగుంటుందని కొన్ని రోజుల పాటు సమాలోచనలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల కిందట కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తారు.
రెండో ముంబైగా ప్రసిద్ధి
1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించరాదు. రాయలసీమలోని కడపతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా బంగారు దుకాణాలు నిర్వహించుకునేవారు. వీరంతా లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసేవారు.
ప్రొద్దుటూరులో మాత్రం అప్పట్లోనే లైసెన్సు కలిగిన దుకాణాలు ఉండేవి. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో సీబీఐ దాడులు ఎక్కువగా జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ముంబై, బెంగళూరులకు దీటుగా విక్రయాలు
ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాలవీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి.
వివాహ ముహుర్తాలు, పండుగలు, అక్షయ తృతీయ రోజున ప్రొద్దుటూరు గోల్డ్ మార్కె ట్ నూతన శోభను సంతరించుకుంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారు కొనడాన్ని మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని బంగారు వ్యాపారులు మంచి డిజైన్లను తయారు చేయిస్తారు. ఆన్‌లైన్‌ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. దీంతో ఏ షాపునకు వెళ్లినా ఒకటే ధర ఉంటుంది. అందువల్ల ప్రొద్దుటూరు బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు.
నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు
ప్రొద్దుటూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు ఇక్కడ పని చేస్తున్నారు. మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇక్కడి స్వర్ణకారులు చేసిన ఆభరణాలకు మంచి గుర్తింపు ఉండేది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు అత్యధికంగా ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణా, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల నుంచి రోజు కొనుగోళ్ల నిమిత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. కోరిన డిజైన్లలో నగలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు సిద్ధహస్తులు. ముక్కు పుడక.. పెద్ద ఆభరణాలను స్థానికంగా తయారు చేస్తారు. దేవతా మూర్తులకు అలంకరించే కిరీటాలు, ఇతర కంఠాభరణాలను తయారు చేసే స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. బంగారు కరిగించేవారు, నగను తయారు చేసేవారు. తయారైన నగకు రాళ్లను పొదిగేవారు, మెరుగులు దిద్దేవారు.. ఇలా పలువురు కష్టపడితేనే అందమైన నగలు తయారు అవుతాయి.
స్వచ్ఛమైన బంగారంతో నగలు
స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ప్రొద్దుటూరు వ్యాపారుల ప్రత్యేకత. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడం వెనుక ఎందరో స్వర్ణకారులు, వ్యాపారుల శ్రమ ఉంది. స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది.
– ఉప్పర మురళీ, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు.
రెడీమేడ్ ఆభరణాలతో పని తగ్గింది
కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. ఇటీవల రెడీమేడ్ ఆభరణాల దిగుమతి ఎక్కువైంది. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది. మిగతా సమయాల్లో బాడుగలు కూడా రావడం కష్టమే.
–షామీర్, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు
కటింగ్ వర్క్ షాపు నిర్వహిస్తున్నా
ఏడేళ్ల నుంచి గోల్డ్ కటింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నా. ఈ పని చాలా సంతృప్తి కరంగా ఉంది. దీపావళి, దసరా పండుగలు, గ్రామాల్లో పంటలు చేతికి వచ్చినప్పుడు మార్కెట్ కళ కళ లాడుతుంటుంది. ఆ సమయంలో మాకు చేతినిండా పని ఉంటుంది. స్వర్ణకారులకు ప్రభుత్వం రాయితీలతో రుణాలు ఇప్పిస్తే బాగుంటుంది.
– అబ్దుల్ రెహమాన్, ఫ్యాన్సీ వర్క్ షాపు, ప్రొద్దుటూరు.
Comments
Please login to add a commentAdd a comment