అందరికీ ఆదర్శం.. చెన్నమరాజుపల్లె గ్రామం | Chennamaraju Palli In YSR District Look On Development | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్‌కు స్వస్తి.. అభివృద్ధిపై దృష్టి

Published Fri, Oct 21 2022 1:01 PM | Last Updated on Fri, Oct 21 2022 1:28 PM

Chennamaraju Palli In YSR District Look On Development - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : కొన్నేళ్ల క్రితం వరకు ఆ గ్రామం నిత్యం ఫ్యాక్షన్‌  గొడవలతో అట్టుడుకుపోయేది. ఆ ఊరు పేరెత్తితేనే చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు హడలెత్తిపోయే పరిస్థితి. ఒకానొక సమయంలో వేరే ఊరి అమ్మాయిని ఆ గ్రామానికి ఇవ్వాలన్నా భయపడిపోయేవాళ్లు. ఫ్యాక్షన్‌ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగించేవారు. ఆ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు.  వైఎస్సార్‌ జిల్లాకు వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూ నది ఒడ్డున..పచ్చని పొలాల మధ్యన ఉన్న ఆ ఊరే చెన్నమరాజుపల్లె. ఫ్యాక్షన్‌ ఘర్షణలు గ్రామాభివృద్ధిని పడేలా చేశాయి. పగలు, ప్రతీకారేచ్ఛల మధ్య పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఊ ఊళ్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామం ఉపాధిబాటలో పయనిస్తోంది. మంచాల అల్లిక గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ఫ్యాక్షన్‌ వద్దు ప్యాషన్‌ ముద్దు అనే నినాదంతో గ్రామస్తులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 

1970 నుంచి 12 ఫ్యాక్షన్‌ హత్యలు 
ప్రొద్దుటూరు మండలంలోని చెన్నమరాజుపల్లెలో 1970లో ఫ్యాక్షన్‌ మొదలైంది. గ్రామాధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్‌ గొడవల్లో ఇప్పటి వరకు 12 మంది హత్యకు గురయ్యారు. ఇవి గ్రామంలో జరిగిన హత్యలే. గ్రామ ఫ్యాక్షన్‌  గొడవలకు అనుబంధంగా ఇతర ప్రాంతాల్లోనూ చాలా మంది హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గ్రామాధిపత్య పోరుతో ఈ హత్యల పరంపర కొనసాగింది. ఈ క్రమంలోనే ఆలయ భూముల కోసం కొన్నేళ్ల పాటు హత్యలు, ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. 1970లో ఇద్దరు, 71లో ఇద్దరు, 72లో ఒకరు, 79లో ముగ్గురు, 99లో ఒకరు, 2011 ముగ్గురు హత్యకు గురయ్యారు. 1970 నుంచి 79 వరకు 8 మంది ఫ్యాక్షన్‌ గొడవల్లో చనిపోయారు. తర్వాత 20 ఏళ్ల పాటు చెన్నమరాజుపల్లెలో ఎలాంటి గొడవలు లేవు. అంతా సద్దుమణిగి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్న సమయంలో పాతకక్షలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. 1999–2011 మధ్య నలుగురు హత్యకు గురయ్యారు. 1999 నుంచి గ్రామంలో పోలీస్‌ పికెట్‌ నడుస్తోంది.  

గ్రామ స్వరూపాన్నే మార్చేసిన అల్లికలు  
మంచాల అల్లికలు చెన్నమరాజుపల్లె గ్రామ స్వరూపాన్నే మార్చేశాయని చెప్పవచ్చు. 450 కుటుంబాలున్న ఈ గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. భూస్వాములైతే గ్రామంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే ఉన్నారు. రాందాసు అనే వ్యక్తి మొదట్లో ఇనుప పైపుల మంచాల అల్లికలు చేసేవాడు. రామలక్షుమ్మ అతని వద్ద అల్లిక పని నేర్చుకుంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఐదారుగురు ఈ పని చేసేవారు. మంచాలను అల్లడానికి సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లేవారు. రాను రానూ అల్లిక పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది.

ప్రతి రోజు ప్రొద్దుటూరుకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని వారు భావించారు. దీంతో మంచాల ఫ్రేంలు, వైరు పంపిస్తే ఇంటి వద్దనే అల్లి పంపిస్తామని కొందరు గ్రామస్తులు దుకాణ యజమానులకు తెలిపారు. ఇందుకు వారు అంగీకరించి ఇనుప ఫ్రేంలు, వైర్‌ను చెన్నమరాజుపల్లెకు పంపించసాగారు. 4–5 ఏళ్ల వరకు 20 కుటుంబాలు మాత్రమే అల్లిక పని చేసేవారు. ఇంట్లోనే ఉంటూ ఈ పని చేయడం మిగతా వారిని ఆకర్షించింది. దీంతో గ్రామంలోని ఇతర మహిళలు, పురుషులు అల్లిక పని నేర్చుకునేందుకు మక్కువ చూపసాగారు. కొందరు గ్రామంలోనే తెలిసిన వారి వద్ద పని నేర్చుకోగా, ఇంకొందరు ప్రొద్దుటూరుకు వెళ్లి నేర్చుకున్నారు. ప్రస్తుతం 75 శాతం కుటుంబాలు అల్లిక పనిని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. చాలా మంది మహిళలు ఈ వృత్తిలో చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నెమలి, చిలుక, పుష్పాలు, హంస, చిలక ఇలా అనేక రకాల డిజైన్‌లతో అల్లికలు చేస్తున్నారు.  

ఆర్థికంగా పరిపుష్టి
చెన్నమరాజుపల్లె గ్రామంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ప్రొద్దుటూరులో ఫర్నీచర్‌ దుకాణాలు, మంచాల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇక్కడ తయారైన మంచాలు రాయలసీమ వ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. ఇనుప ఫ్రేంలు మాత్రమే తీసుకొని వెళ్లే వారు కొందరుంటే, అల్లిన మంచాలను తీసుకెళ్లేవారు ఎక్కువ శాతం ఉన్నారు. చెన్నమరాజుపల్లె గ్రామం అల్లికలకు ప్రసిద్ధిగాంచడంతో ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీ, దుకాణ యజమానులు ఈ పనిని వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు 1500 నుంచి 2000 మంచాలు తయారుఅవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడు రకాల వైర్లతో మంచాలను అల్లుతారు. లావుగా ఉన్న వైర్‌తో మంచం అల్లినందుకు రూ. 120 నుంచి 150, సన్నటి వైర్‌తో అల్లితో రూ. 280– 300, మహారాష్ట్ర వైర్‌తో మంచం అల్లితే రూ. 1000–1200 కూలిగా ఇస్తారు. లావు వైర్‌తో ఒక్కో వ్యక్తి రోజుకు 5 మంచాల వరకు అల్లుతారని చెబుతున్నారు. సన్నటి వైర్‌తో అయితే 2 లేదా మూడు మంచాలు అల్లుతామన్నారు. నలుగురు, ఐదుగురు ఉన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో మంచాలను అల్లుతున్నారు. కొన్నేళ్ల నుంచి పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలోని ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు యువకులు ఆర్మీ, పోలీసు, బ్యాంకు, ట్రాన్స్‌కో. సచివాలయ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

 

గ్రామస్తుల్లో మార్పు రావడం సంతోషాన్ని ఇస్తుంది 
ఫ్యాక్షన్‌ గొడవలతో అభివృద్ధికి దూరంగా ఉన్న చెన్నమరాజుపల్లె గ్రామస్తుల్లో మార్పు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. అల్లిక పనులతో వారి కుటుంబాలతో పాటు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. 
    – సంజీవరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ, ప్రొద్దుటూరు

పిల్లలను బాగా చదివించుకుంటున్నాం 
కొన్నేళ్ల క్రితం వరకు గ్రామంలో అభివృద్ధి ఊసే లేదు. ఫ్యాక్షన్‌ గొడవల్లో అనేకమందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలో గతంలో నాటి పరిస్థితులు లేవు. మంచాల అల్లిక పనులతో గ్రామం ఉపాధి బాట పట్టింది. పిల్లలను బాగా చదివించుకుంటున్నాం.  
– ఎన్‌ వెంకటసుబ్బయ్య, చెన్నమరాజుపల్లె 

ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా 
ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పని చేసుకోవడం బాగుంది. మా గ్రామంలో ఎక్కువ మందికి ఉపాధి దొరకడం సంతోషంగా ఉంది.  
– దేవి, చెన్నమరాజుపల్లె  

ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాం 
మాకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరం అల్లిక పని చేసేవాళ్లం. అల్లిక పని ద్వారా వచ్చిన డబ్బుతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. ఇద్దరు కుమారుల్లో వెంకటగ్రేస్‌ ఆర్మీలో సైనికుడిగా, చైతన్యకుమార్‌ లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. 
 – గుర్రమ్మ, చెన్నమరాజుపల్లె  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement