శ్రీకాకుళం : ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నించినా రాకపోవడం, ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై దివ్యాంగుడిగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘సారీ బ్రదర్...’ అంటూ సోదరుడికి సందేశం పంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంపురం గ్రామానికి చెందిన గెడ్డం సుధీర్ బీటెక్ పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే పోటీపరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు.
సోదరుడు సంతోష్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడి సాయంతో సుధీర్ అక్కడే ఉండేవాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ కాలికి బలమైన గాయమైంది. దివ్యాంగుడిగా మారడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా తన సోదరుడు సంతోష్‌కు ‘సారీ బ్రదర్..’ అంటూ తన ఆవేదన తెలియజేస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఫోన్‌కు సందేశం పంపాడని గ్రామస్తులు తెలిపారు. సుధీర్ తండ్రి తులసీదాస వలసకూలీ.
ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తల్లి భూదేవి గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతిచెందాడనే వార్త తెలుసుకున్న తల్లి కుమిలిపోతోంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరితరం కావటం లేదు. సుధీర్ మృతదేహానికి హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తిచేసి, ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. మరోవైపు తండ్రి తులసీదాస్ కూడా హుటాహుటిన ఆదివారం ఇక్కడికి వస్తున్నారు. సుధీర్ మృతదేహం ఆదివారానికి గ్రామానికి చేరుతుందన్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment