భృతిని కట్‌ చేసేందుకు మరో ఎత్తుగడ  | Unemployed Youth Fires On Mukhyamantri Yuvanestham Scheme | Sakshi
Sakshi News home page

భృతిని కట్‌ చేసేందుకు మరో ఎత్తుగడ 

Published Thu, Jan 31 2019 8:54 AM | Last Updated on Thu, Jan 31 2019 1:45 PM

Unemployed Youth Fires On Mukhyamantri Yuvanestham Scheme - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : తాము అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం.. లేకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత భృతి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇచ్చే రూ.వెయ్యికి పలు నిబంధనలు పెట్టడంతో అర్హులైన నిరుద్యోగులు భృతికి దూరమవుతున్నారు. యువనేస్తం పథకం లబ్ధిదారులు ఇప్పటివరకు మీ–సేవా కేంద్రం, రేషన్‌ డీలర్ల వద్ద బయోమెట్రిక్‌ నమోదు చేసుకుంటే భృతి జమయ్యేది. కానీ.. ఈ నెల నుంచి నిరుద్యోగ యువత సాధికార సర్వేలో ఏ మండలంలో నమోదు చేసుకున్నారో అక్కడే బయోమెట్రిక్‌ వేయాలనే కొత్త నిబంధనను ప్రభుత్వం తెచ్చింది. దీంతో పోటీ పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే భృతి రానుపోను చార్జీలకే సరిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

భారీగా కోత విధించేందుకే..  
భృతి తీసుకునే వారిలో 60 నుంచి 70 శాతం మంది అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటూ, ఉద్యోగాన్వేషణలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొత్త నిబంధనతో వీరంతా తీవ్రంగా నష్టపోనున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్‌ తీసుకునే అభ్యర్థులు సొంత ఊరికొచ్చి వెళ్లేందుకు రూ.వెయ్యి కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన అంశాలను ప్రభుత్వం ఇదివరకే స్పష్టంగా ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్‌ డేటా, ప్రజా సాధికార సర్వే, రేషన్‌కార్డు డేటా బేస్‌ అంశాలను స్పష్టంగా పేర్కొంది. వీటితో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అప్రెంటిస్‌ డేటా, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, జనాభా లెక్కల వివరాలు, అర్హతలను పొందుపర్చాల్సి ఉంది. ప్రభుత్వం పొందుపర్చిన అంశాలు లబ్ధిదారులను వడపోసేలా ఉన్నాయని నిరుద్యోగులంటున్నారు. ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారికి, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి భృతి ఇచ్చేది లేదని నిబంధనల్లో పేర్కొంది. 

12 లక్షల మందికని ప్రకటించి..  
రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన వారు సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ.. భృతిని ఇప్పటివరకు నాలుగు లక్షల మందికే ఇస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించిన వారికి.. పథకానికి మీరు అనర్హులని వస్తుండటంతో వారు నిర్ఘాంతపోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,73,670 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,31,888 మందే పథకానికి అర్హులుగా పేర్కొంది. ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు ఫోన్‌ నంబర్‌ అనుసంధానం కాకపోవడంతో అధికశాతం మంది ఇబ్బందిపడుతున్నారు. అన్ని అర్హతలుండీ తమకు భృతి అందకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 24,758 మంది అభ్యర్థులు తమకు భృతి రావడం లేదని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే 4,30,000 మంది పథకానికి అర్హత సాధించారని చెబుతున్న ప్రభుత్వం.. జనవరి నెలలో 3,59,720 మందికే ఖాతాల్లో జమచేసింది. వివిధ కారణాలు చూపుతూ సుమారు 70 వేల మందికి ఎగవేసింది. 

ఇక మిగిలేదేంటి? 
 గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన నేను హైదరాబాద్‌లో గ్రూప్స్‌నకు ప్రిపేరవుతున్నా. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన కారణంగా నెల నెలా మా ప్రాంతానికి వెళ్లాలి. రానుపోను చార్జీలకే ఆ భృతి సరిపోతుంది. ఇక నాకు మిగిలేదేంటి?  – ఎం.వెంకటకృష్ణ, నగరం మండలం, గుంటూరు జిల్లా 

కోత విధించేందుకే కొత్త నిబంధన 
నిరుద్యోగ భృతిలో కోత విధించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోంది. రూ.2 వేలు భృతి అని చెప్పి.. వెయ్యితో సరిపెట్టారు. అదీ సరిగా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దూర ప్రాంతాల నుంచి రావాలంటే కోచింగ్‌కు ఆటంకం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో వెనుకపడతాం.  – ఎం.శ్రీనివాసరావు, రేపల్లె, గుంటూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement