ఉద్యమించకపోతే.. సీమకు అన్యాయం | unfair .. | Sakshi
Sakshi News home page

ఉద్యమించకపోతే.. సీమకు అన్యాయం

Published Sun, Mar 1 2015 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

unfair ..

అనంతపురం టౌన్ : ‘కృష్ణా జలాల కోసం గళం విప్పకపోతే నష్టపోతాం. ఉద్యమించకపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది’ అని అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ‘‘హంద్రీనీవాకు 80 టీఎంసీ నికర జలాలు కేటాయించాలి’’ అనే అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
 
 ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల కోసం గళలాలు వినిపించకపోతే రాయలసీమకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించడం జరుగుతుందన్నారు. దీంతో శ్రీశైలం డ్యాంలో ఆ మొత్తం నీరు ఆదా అవుతుందన్నారు. అలా అదా అయ్యే 80 టీఎంసీ నీటిని  హంద్రీ నీవా ప్రాజెక్టుకు నికర జలాలను కేటాయించాలన్నారు. అంతే కాకుండా శ్రీశైలం డ్యాంలో 852 అడుగులకు తగ్గకుండా నీరు నిలువ ఉండేలా చూడాలన్నారు. పట్టిసీమ పథకం కోసం రూ.1,350 కోట్లు కేటాయించారని, 12 నెలల్లో పూర్తి చేయకపోతే ఎస్కలేషన్ చార్జీలు ఇవ్వబోమని నిబంధన ఉంచారన్నారు. అదే తరహాలో హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తికి రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించి, 12 నెలల్లో పనులు పూర్తి చేస్తేనే ఎస్కలేషన్ చార్జీలు ఇస్తామన్న నిబంధన ఈ ప్రాజెక్టుకి వర్తింపజేయాలన్నారు. ఇవన్నీ నోటి మాటగా కాకుండా స్పష్టమైన జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చొరవతో హంద్రీనీవా ద్వారా జిల్లాకు కృష్ణ జలాలు వచ్చాయని, అయితే అధికార పార్టీ నాయకులు తాము చేయని పనిని చేశామని చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకున్నా అభ్యంతరం ఏమీ లేదన్నారు. ఇప్పుడైనా హంద్రీనీవాను పూర్తి చేసి నీరు ఇచ్చామని చెప్పుకోండని అన్నారు.
 
 ప్రజా ఉద్యమానికి నాంది పలకాలి
 అనంతపురం జిల్లాకు కృష్ణ నీరు రావాలనేది 45 ఏళ్ల కల. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నేరవేర్చారు. ప్రస్తుతం రాయలసీమకు.. ముఖ్యంగా జిల్లాకు అన్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం పోరాడే పరిస్థితిని కల్పిస్తున్నారు. హంద్రీనీవాకు 80 టీఎంసీ నికర జలాలు కేటాయించేలా జీవో విడుదల చేయాలి. ఉద్యమ పంథాలో ముందుకు వెళితే తప్ప సాధ్యంకాదనేది స్పష్టమవుతోంది. ఇందుకు మనమంతా గొంతులు పెంచాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాము.                    
 - వీకేరంగారెడ్డి, అనంత సాధన కమిటీ చైర్మన్
 
 నీటి కేటాయింపు అధికారికంగా జరగాలి
 జిల్లాకు కృష్ణ జలాలు తప్పితే ప్రత్యామ్నాయం లేదు. హంద్రీ నీవాకు నీటి కేటాయింపు అధికారికంగా జరగాలి. నికర జలాలు కేటాయిస్తేనే జిల్లాకు మనుగడ. హంద్రీ నీవాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధిక స్థాయిలో నిధులు కేటాయించడం ద్వారా ఈ రోజు జిల్లాకు కృష్ణ నీరు వచ్చింది. గత నాలుగేళ్లగా పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణ నదిలోకి మళ్లించడం ద్వారా శ్రీశైలం డ్యాంలో ఆ స్థాయిలో నీరు ఆదా అవుతుంది. ఆ నీటిని హంద్రీనీవాకు నికర జలాలు కేటాయించాలి. లేదంటే జిల్లాకు మనుగడ ఉండదు. ఇవన్నీ మాటల ద్వారా కాకుండా జీఓ రూపంలో ఇవ్వాలి. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించేందుకు అందరూ నడుంబిగించాలి. జిల్లాకు నీటి సాధనకు చేపట్టే ఉద్యమానికి తాము పూర్తి మద్ధతు ఇచ్చి వెన్నంటి నిలుస్తాం.
 - గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెలే, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు
 
 నికర జలాల సాధనకు ఉద్యమించాలి
 కరువు జిల్లా అనంతపురం మనుగడ సాగించాలంటే హంద్రీనీవాకి 80 టీఎంసీ నికర జలాలు కేటాయించాలి. దీని సాధనకు ఉద్యమించాలి. లేకపోతే మనకు తీరని అన్యాయం చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 40 టీఎంసీలు ఇచ్చారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కి మళ్లిస్తే శ్రీశైలం డ్యాంలో 80 టీఎంసీ ఆదా అవుతాయి. హంద్రీనీవా సామర్థ్యం పెంచి 80 టీఎంసీలు ఇవ్వాలి. రాయలసీమకి నీరు ఇస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. గాలిలో దీపం పెట్టినట్లు మాట్లాడితే సరిపోదు. 80 టీఎంసీ నికర జలాలు కేటాయిస్తున్నట్లు స్పష్టమైన జీవో ఇవ్వాలి. అది సాధించేందుకు పోరాటం చేయాలి.      
 - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 వైఎస్‌ఆర్ వల్లే కృష్ణా నీరు చూశాం
 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా హంద్రీనీవాకు మూడు సార్లు శంకుస్థాపన చేశారే తప్ప నిధులు కేటాయించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నిధులు కేటాయించి సంకల్పంతో పనిచేయండం వల్లనే ఈ రోజు జిల్లా వాసులు కృష్ణా నీటిని చూసే అవకాశం దక్కింది. ఇప్పుడున్న ప్రభుత్వం హంద్రీనీవాకు రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో ఉద్యోగుల జీతాలకు రూ.90 కోట్లు పోగా మిగిలిన రూ.10 కోట్లతో హంద్రీనీవా ఎలా పూర్తి చేయడం సాధ్యం. ప్రస్తుత బడ్జెట్‌లో హంద్రీనీవాకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి 80 టీఎంసీ నీరు మళ్లించడం ద్వారా శ్రీశైలంలో ఆదా అయ్యే 80 టీఎంసీల నీటిని రాయలసీమకు నికర జలాలుగా కేటాయించాలి.
 - ప్రొఫెసర్ చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక కన్వీనర్
 
 శాశ్వత ప్రాతిపదికన నీరివ్వాలి
 జిల్లా అవసరాల దృష్ట్యా శాశ్వత ప్రాతిపదికన నీరివ్వాలి. హంద్రీనీవాకు రూ.100 కోట్లు కేటాయించడం చూస్తే రాయలసీమకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనేది స్పష్టమవుతోంది. నిధులు కేటాయించకుండా హంద్రీ నీవా ద్వారా కుప్పంకి నీరు తీసుకెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదం. ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. రాయలసీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవాకు 80టీఎంసీ నికర జలాలు కేటాయించాలి.             
 - నాగరాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement