‘ఉచిత’ దోపిడీ!
► ఎస్వీ ఆయుర్వేదిక్‌లో ఇంటిదొంగల దందా
► వైద్యుల టేబుల్ వద్దే మందుల అమ్మకాలు
► కమీషన్లకే పరిమితమైన వైద్యాధికారులు
► నిరుపేద రోగులకు తీరని అన్యాయం
► దిగజారుతున్న టీటీడీ ప్రతిష్ట
► చోద్యం చూస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల, కొందరు ఇంటిదొంగ ల పనితీరు కారణంగా అభాసుపాలవుతోంది. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. దీంతో వైద్యం కోసం వస్తున్న నిరుపేద రోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. వీటిని అరికట్టాల్సిన వైద్యాధికారులు వివిధ ఆయుర్వేద కంపెనీలు కట్టబెట్టే లక్షల కమీషన్లలో జోగుతుండగా, టీటీడీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. రూ. కోట్ల బడ్జెట్ కల్గి ఉన్నతాశయంతో వెంకన్న నిధులతో నడుస్తున్న సంస్థ ప్రతిష్ట కొందరు చీడపురుగుల కారణంగా దిగజారుతోంది.
► వైద్యం కోసం ఇటీవల వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వెంకటమ్మ ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి వస్తే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒకరు మాటామాటా కలుపుతూ ‘గంగమ్మ గుడి దగ్గర మంచి ఆయుర్వేద వైద్యం చేస్తారు. రూ.60 వేలు తీసుకుంటారు. 3 నెలల పాటు 15 రోజులకోసారి రావాలి. వచ్చిన ప్రతి సారీ రూ.20 వేలు కడితే సరిపోతుంది’ అని సలహా ఇచ్చారు. దాంతో ఆమె అక్కడకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా సమయానికి దూరపు బంధువు వచ్చి ఆపాడు. కోట్ల రూపాయల వేంకటేశ్వరస్వామి డబ్బుతో ఉచితంగా వైద్యం అందిస్తుంటే దళారీల మాటలు నమ్మకండి అని చెప్పడంతో ఆమె విరమించుకుని ఇక్కడేవైద్యం పొందారు.
► కౌమారబృత్యంలో మరో డాక్టర్ బయట మందుల దుకాణదారులతో కుమ్మక్కై తమ విభాగానికి వచ్చే రోగులకు ఆస్పత్రిలో లేని మందులే రాస్తున్నారు. సహజంగా మందులను వైద్యులు చిన్న చిన్న స్లిప్‌లలో రాసిస్తారు. వాటిని తీసుకెళ్తే ఆస్పత్రి ఫార్మసీలో మందులు ఇస్తారు. ఈ డాక్టరు మాత్రం స్లిప్పుల్లో ‘కాల్..మీ..’ అని రాసి అడ్రస్ చెప్పి మరీ బయటకు పంపుతారు.
► ప్రసూతి విభాగంలో ఉన్న ఒక డాక్టర్ బయట స్కానింగ్ కేంద్రాలతో కుమ్మక్కై అవసరం లేకున్నా వేలల్లో టెస్టులు రాసి రోగులను దోపిడీ గురిచేస్తున్నారు.
► పిల్లల విభాగంలో ఇద్దరు డాక్టర్లు బంగారం కలిపే కొన్ని రకాల ఖరీదైన మందులను రోగులకు ఆస్పత్రిలోని తమ సీట్ల వద్దే అంటగట్టి వేలల్లో డబ్బు గుంజుతున్నారు.
► ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు తరచూ ఆస్పత్రిలో రౌండ్స్‌లో ఉండాల్సి ఉండగా అందుకు విరుద్దంగా తమకు అనుకూలమైన కంపెనీలకు పెద్దస్థాయిలో ఆర్డర్లు పెట్టి లక్షల్లో కమీషన్లు పొందుతూ కాలం గడిపేస్తున్నారు.
► రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన జనరేటర్ వైర్లను ఎలుకలు కొరికితే పట్టించుకోకుండా నెలల పొడవునా మూలన పడేశారు.
► ఇంకొందరు వైద్యులు అటెండర్లకు నెలానెలా రూ.3 వేలు అప్పజెప్పి రోగులను తమవద్దకు (బయట ఉన్న క్లినిక్‌లకు) పంపేలా ఏర్పాట్లు చేసుకుని మూడు ప్రిస్క్రిప్షన్‌లు.. ఆరు వేలుగా వ్యాపారం సాగిస్తున్నారు.
మా దృష్టికి రాలేదు..
బంగారం కలిపై మందులను మేము తెప్పించడం లేదు. అలాంటి మందులను వైద్యులు వారి టేబుల్స్ దగ్గరే విక్రయిస్తున్నారనే విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. మేమెతే అసవసరంగా టెస్టులు రాయడం లేదు. ఇక కాల్‌మీ అని రాసి పంపే స్లిప్‌లకు సంబంధించి అలా రాయవద్దని హెచ్చరికలు చేస్తున్నాం.
-డాక్టర్ పార్వతి, సూపరింటెండెంట్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి