నిరంతర విద్యుత్‌పై సర్కారు వెనుకడుగు
డిమాండ్ పెరిగి.. కోతలు పెరిగితే పరువు పోతుందన్న మంత్రులు
వ్యవసాయూనికి 7 గంటలు కూడా ఇవ్వలేకపోవడంపైనా చర్చ
2 నుంచి 4 మిలియన్ యూనిట్లు
అదనంగా కావాలన్న విద్యుత్ శాఖ
అమలు చేసే ప్రాంతాల పేర్లు లేకుండానే నేడు ప్రకటన
హైదరాబాద్: అందరికీ నిరంతర విద్యుత్ అంటూ అదేపనిగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా రూటు మార్చింది. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుని ఆఖరి నిమిషంలో వెనకడుగు వేసింది. మొదటి నుంచీ చెబుతున్నట్టు కాకుండా గురువారం విజయవాడలో మరో ఆర్భాటపు ప్రకటనకే పరిమితమయ్యే యోచనలో ఉంది. ప్రభుత్వం ముందుగా వెల్లడించిన ప్రకారం రెండు కార్పొరేషన్లు, 9 పురపాలక సంఘాలు, 39 మండలాల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ‘అందరికీ విద్యుత్’ పథకాన్ని అమలు చేయూల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ ప్రాంతాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయబోవడం లేదని సమాచారం. పథకం జాబితాలో ఏయే మండలాలు చేరుస్తారనేది ఇప్పటికిప్పుడు వెల్లడించడం కష్టమని అధికారులు అంటున్నారు. మెుత్తం మీద 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఎంపిక చేసే మండలాల వివరాలను గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ సంస్థలకు చెబుతారా, వాణిజ్య విద్యుత్ కనెన్షన్లకు కాకుండా గృహాలకే వర్తింపజేస్తారా అనేదానిపై అధికారుల్లోనే స్పష్టత లేదు. తాత్కాలిక రాజధాని విజయవాడ, ఐటీ హబ్ విశాఖతో పాటు తిరుపతికి నిరంతర విద్యుత్ ఇస్తారని మొదటి నుంచి ఊహాగానాలు వచ్చాయి. చివరకు దీన్ని తిరుపతికే పరిమితం చేయాలని భావించారు. అరుుతే ఈ ఒక్క కార్పొరేషన్ పేరుకూడా సీఎం అధికారికంగా వెల్లడించే అవకాశం కన్పించడం లేదు. కాబోయే రాజధానికే 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే ఏం సమాధానం చెప్పుకోవాలనే ఆందోళనతోనే సర్కారు ఒక్క రోజులోనే వ్యూహాన్ని మార్చింది.
ఏం జరిగింది?
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరికీ నిరంతర విద్యుత్ పథకం అమలు చేసే ప్రాంతాలపై మంత్రులు ఆసక్తి వ్యక్తం చేశారు. పథకాన్ని తమ ప్రాంతాలకు విస్తరించాలనే ప్రజల ఒత్తిడిని కొంతమంది ప్రస్తావించారు. విజయవాడ సహా ప్రధాన నగరాలకు పథకం అమలు చేయకపోవడంపై విమర్శలొచ్చే వీలుందని పేర్కొన్నారు. పథకం అమలు చేయడం వల్ల డిమాండ్ పెరుగుతుందని, ఉత్పత్తి లేకపోవడం వల్ల కోతలు పెరిగే వీలుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇదే జరిగితే ప్రజల్లో ప్రభుత్వం పరువు పోయే ప్రమాదం ఉందనే వాదన వచ్చింది. మరోవైపు వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, ఇప్పటికీ 7 గంటలు ఇవ్వలేకపోతున్నామనే అంశాన్నీ పలువురు ప్రస్తావించారు. 24 గంటల విద్యుత్‌ను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసినా, డిమాండ్ పెరిగి, వ్యవసాయంపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అందించిన నివేదికపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి సరిగ్గా 24 గంటల ముందు విద్యుత్ శాఖ క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంతో ఓ నివేదికను ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో 135 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, ఇది క్రమంగా పెరుగుతోందని వెల్లడించింది. ఇప్పటివరకు ఎలాంటి లోటు లేకున్నా, కొన్ని ముఖ్య నగరాలు, పట్టణాలకు నిరంతర విద్యుత్ ఇస్తే లోటు 5 నుంచి 10 శాతం పెరిగే వీలుందని పేర్కొంది. దీంతో రోజుకు కనీసం 2 నుంచి 4 మిలియన్ యూనిట్లు అదనంగా అవసరమని లెక్కగట్టింది. విజయవాడను ఎంపిక చేస్తే భారం మరింత ఉంటుందని పేర్కొంది. కనీసం 2 లక్షల గృహాల వినియోగం నెలకు సగటున 150 నుంచి 250 యూనిట్లకు పెరిగే వీలుందని లెక్కగట్టింది. విశాఖలో వినియోగం 9 శాతం పెరగొచ్చని స్పష్టం చేసింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్లో అత్యధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావచ్చని పేర్కొంది. మరోవైపు విద్యుత్ పంపిణీ నష్టాలపై సమగ్ర సమాచారం అందజేసింది. స్మార్ట్ పరికరాలు అమర్చే వరకూ దీన్ని అడ్డుకోవడం కష్టమని పేర్కొంది. ఇక రబీ సీజన్ మొదలయ్యే అక్టోబర్‌లో వ్యవసాయ విద్యుత్ వాడకం రెట్టింపు అవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో గృహ వినియోగదారులు 40 శాతం, వ్యవసాయం 35 శాతం, పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు 25 శాతం విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఎల్‌ఈడీ బల్బులను కేవలం 4 జిల్లాలకే పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మిగతా జిల్లాల్లో పరిస్థితి యథాతథంగా ఉంటుందని, దీనివల్ల విద్యుత్ పొదుపు ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు వివరించారు. ఇలా ఎటు చూసినా ప్రతిబంధకాలే కన్పించడంతో చివరకు ప్రభుత్వం అందరికీ విద్యుత్ పథకం అమలు ప్రాంతాల పేర్లు వెల్లడించకూడదనే నిర్ణయానికొచ్చింది.
తూతూ మంత్రంగానే ప్రకటన!
అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో అందరికీ నిరంతర విద్యుత్ (24ఁ7) అందజేస్తామంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. తర్వాత కొన్ని ప్రాంతాలకే అంటూ మెలికపెట్టింది. చివరకు అక్టోబర్ 2 సమీపించే సరికి ఏ ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుందో చెప్పలేని పరిస్థితిలో పడిపోరుుంది. బుధవారం సాయంత్రం వరకు ఏ ప్రాంతానికీ పథకం అమలుకు సంబంధించిన ఆదేశాలు వెళ్ళలేదు. కాగా గురువారం ఈ పథకంపై ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి విజయవాడను వేదికగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పథకాన్ని మాత్రమే ప్రకటిస్తారని, ప్రాంతాల వివరాలు వెల్లడించరని సమాచారం. అరుుతే ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేని పథకంగా ప్రజలు భావిస్తారనే సందేహాలు రాకుండా తరుణోపాయం ఏమిటనే దానిపైనా సర్కారు ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొన్ని ముఖ్య ప్రాంతాల పేర్లు వెల్లడించే అవకాశం ఉందని, క్రమేణా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామనే ప్రకటన చేసే వీలుందని తెలుస్తోంది.
ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ
నిరంతర విద్యుత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం 37 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. గురువారం విజయవాడలో సీఎం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిమాండ్ సైడ్ ఎఫిషియెన్సీ లైటింగ్ ప్రోగ్రామ్ (డెల్ప్) కింద మొదటి దశలో గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలను ఎంపిక చేశారు. ఇదే రోజు ఈ నాలుగు జిల్లాల్లోనూ పంపిణీ ప్రారంభమవుతుంది. రూ.400 ఎల్‌ఈడీ బల్బును రూ.10కే అందజేస్తారు. దీనివల్ల వినియోగదారుడికి ఏటా రూ.500 నుంచి రూ.700 మేర ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఏటా రూ. 231 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని డిస్కంలు వెల్లడించారుు. కాగా రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ దిశగా త్వరితగతిన అగుడులు వేయాలని, నష్టాలను తగ్గించాలని ఇంధన శాఖను కోరింది.
నిరంతర విద్యుత్‌పై ప్రపంచబ్యాంక్ అధ్యయనం
రాష్ట్రంలో అమలు చేయనున్న అందరికీ నిరంతర విద్యుత్ పథకాన్ని ప్రపంచ బ్యాంక్ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. ఆసిస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం గురువారం విద్యుత్ శాఖ అధికారులను కలిసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంధన పొదుపు, విద్యుత్ కొనుగోళ్ళు, ఉచిత విద్యుత్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖ అధికారులు ప్రతినిధి బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంపై వారు సలహాలు ఇచ్చినట్టు జెన్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు.
అందరికీ మొండి చెయ్యేనా?
Published Thu, Oct 2 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement
Advertisement