
సాక్షి, విశాఖపట్నం: విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీలో దుగరాజపట్నం, రామయ్యపట్నంలలో పోర్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరామని..రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండింటిలో ఒక చోట జాతీయ పోర్టు నిర్మాణం చేపడతామని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి మన్షూక్ మాండవియా తెలిపారు. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏడు దేశాలతో పోర్టుల అభివృద్ధిపై రెండు రోజుల బిమ్స్ టెక్ అంతర్జాతీయ సదస్సు విశాఖ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మన్షూక్ మాండవియా మాట్లాడుతూ.. బిమ్స్ టెక్ లో భారతదేశం పాత్ర అత్యంత కీలకమైందని...ఏడు దేశాల మధ్య పోర్టుల అభివృద్ధి, ఎగుమతులలో సహాయ సహకారాలపై చర్చించి పరస్పర అంగీకార నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
బంగ్లాదేశ్-ఇండియా మధ్య పరస్పర ఒప్పందాల కారణంగా నేరుగా ఎగుమతులకి అవకాశం ఏర్పడిందని వివరించారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఐఐటి ఖరగ్పూర్ లో పోర్టుల అభివృద్ధి పై వెయ్యి కోట్లతో అత్యాధునిక పరీక్షల సాంకేతిక ల్యాబరేటరీ ఏర్పాటు చేశామన్నారు. సాగర్మాల యోజన లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 73 ప్రాజెక్ట్ ల అభివృద్ధి చేపడుతున్నామన్నారు.
పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం..
పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని...తమ ప్రభుత్వం పెట్టుబడుదారులకి సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ఏపీ మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు తెలిపారు. విశాఖ నగరం పర్యాటకంగా...ఆర్థికంగా పెట్టుబడులకి అవకాశమన్నారు. ఈ సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, సెక్యూరిటీ,సేఫ్టీ కి సంబంధించిన అంశాలపై ఏడు దేశాల ప్రతినిధులు చర్చించారు.
బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక క రంగాల సమన్వయంపై ఈ సదస్సు చర్చకు వేదికగా మారింది. 1997 లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా బిమ్స్ టెక్ ప్రారంభమైంది. బిమ్స్ టెక్ ప్రారంభమైన 32 సంవత్సరాల తర్వాత తొలిసారి విశాఖ పోర్టు ఇందుకు ఆతిథ్య మిస్తోంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహనరావు, ఏడు దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ పోర్టుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment