gowtam reddy
-
పెట్టుబడులకు ఏపీ అనుకూలం
సాక్షి, విశాఖపట్నం: విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీలో దుగరాజపట్నం, రామయ్యపట్నంలలో పోర్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరామని..రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండింటిలో ఒక చోట జాతీయ పోర్టు నిర్మాణం చేపడతామని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి మన్షూక్ మాండవియా తెలిపారు. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏడు దేశాలతో పోర్టుల అభివృద్ధిపై రెండు రోజుల బిమ్స్ టెక్ అంతర్జాతీయ సదస్సు విశాఖ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మన్షూక్ మాండవియా మాట్లాడుతూ.. బిమ్స్ టెక్ లో భారతదేశం పాత్ర అత్యంత కీలకమైందని...ఏడు దేశాల మధ్య పోర్టుల అభివృద్ధి, ఎగుమతులలో సహాయ సహకారాలపై చర్చించి పరస్పర అంగీకార నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బంగ్లాదేశ్-ఇండియా మధ్య పరస్పర ఒప్పందాల కారణంగా నేరుగా ఎగుమతులకి అవకాశం ఏర్పడిందని వివరించారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఐఐటి ఖరగ్‌పూర్ లో పోర్టుల అభివృద్ధి పై వెయ్యి కోట్లతో అత్యాధునిక పరీక్షల సాంకేతిక ల్యాబరేటరీ ఏర్పాటు చేశామన్నారు. సాగర్మాల యోజన లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 73 ప్రాజెక్ట్ ల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం.. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని...తమ ప్రభుత్వం పెట్టుబడుదారులకి సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ఏపీ మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు తెలిపారు. విశాఖ నగరం పర్యాటకంగా...ఆర్థికంగా పెట్టుబడులకి అవకాశమన్నారు. ఈ సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, సెక్యూరిటీ,సేఫ్టీ కి సంబంధించిన అంశాలపై ఏడు దేశాల ప్రతినిధులు చర్చించారు. బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక క రంగాల సమన్వయంపై ఈ సదస్సు చర్చకు వేదికగా మారింది. 1997 లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా బిమ్స్ టెక్ ప్రారంభమైంది. బిమ్స్ టెక్ ప్రారంభమైన 32 సంవత్సరాల తర్వాత తొలిసారి విశాఖ పోర్టు ఇందుకు ఆతిథ్య మిస్తోంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహనరావు, ఏడు దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ పోర్టుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, విజయవాడ: ఏపీని ప్రపంచస్థాయి పెట్టుబడుల రాష్ట్ర్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. శుక్రవారం విజయవాడలో భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లామాటిక్ ఔట్ రీచ్ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అనేక దేశాలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఎలక్ర్టా నిక్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రపంచస్థాయి రాష్ట్ర్రంగా ఏపీ: కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్ర్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరీష్ అన్నారు. భారత్‌కు ఏపీ అన్నపూర్ణ వంటిందని పేర్కొన్నారు. -
కార్మిక హక్కుల సంరక్షణా స్ఫూర్తి మేడే!
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చరిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే అలాంటి ఒక చరి త్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి అమెరికాకే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు వినోదం (రిక్రియేషన్) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. మనదేశంలో మొదటిసారిగా 1923లో ‘మే డే’ను పాటించారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాలకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది యువతులు, యువకులు పని చేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. కార్మిక చట్టాలు అమలుకాని ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10, 12 గంటలు పని చేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. ఐ.టి. రంగంలో కూడా కార్మిక చట్టాల అమలుకోసం పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్సోర్సింగ్లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. నిరుద్యోగాన్ని, అశక్తతతను ఆసరా చేసుకుని వాళ్ళచే 10, 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుంచి 14 గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చది వించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ వలన వందేళ్ల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ట చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని రగి లిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటిం చేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని మాత్రమే కాదు.. అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం! పి. గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు -
సీఎంకేనా పెన్షన్.. ఉద్యోగులకు వద్దా?
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఉండేవారికి పెన్షన్ ఇస్తూ.. ప్రజలందరికీ సేవ చేసేవారికి మాత్రం అర్థిక భద్రత కల్పించరా అంటూ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ప్రశ్నించారు. మీరు మాత్రం పెన్షన్ తీసుకుంటూ ఉద్యోగులకు ఇవ్వారా అని చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే ఉద్యోగులే నిన్ను ఓడిస్తారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరకు చేస్తున్న ఉద్యమాలను చంద్రబాబు అణచివేస్తున్నారన్నారు. సీపీఎస్‌లో తెలంగాణలో 1,17,000, ఆంధ్రప్రదేశ్‌లో 1,83 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ విధానం వల్ల ఉద్యోగులకు ఏమాత్రం భద్రత లేదని.. ఉద్యమిస్తున్న వారిని నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సూచనలకు కూడా పక్కదారి పట్టించే విధంగా సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బెంగాల్, త్రిపురలో అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానంలో కట్టించుకుంటున్న డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతున్నారని.. దాని వల్ల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నల్లబెలూన్ల ఎగరవేత
-
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నల్లబెలూన్ల ఎగరవేత
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు విజయవాడలో వైఎస్సార్సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి నేతృత్వంలో 200 మంది కార్యకర్తలు ఒంటికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. అనంతరం నల్ల రంగు బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని గౌతంరెడ్డి విమర్శించారు. -
'మంత్రులు జిల్లాల్లో, యనమల ఢిల్లీలోనా'
-
'మంత్రులు జిల్లాల్లో, యనమల ఢిల్లీలోనా'
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ టీయూసీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. కార్మికుల సమస్యలు, సామాన్యుల కష్టాలు గాలికి వదిలేసిందని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కార్మికుల సమ్యలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని గౌతంరెడ్డి అన్నారు. సమస్యను గాలికి వదిలేసి మంత్రులు శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడులు సొంత జిల్లాల్లో తిరుగుతున్నారని, ఇక కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన సమస్యను పట్టించుకోకుండా జిల్లాల్లో పర్యటిస్తున్నారని గౌతంరెడ్డి అన్నారు. విమానాల ఇంధన చార్జీలలు తగ్గించిన ప్రభుత్వం ఆర్టీసీపై మాత్రం ఇంధన ఛార్జీల భారం మోపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని గౌతంరెడ్డి సూచించారు. -
'ఇది బాబు మార్కు రాజకీయం'
విజయవాడ : శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు బాబు మార్కు రాజకీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా వీధి రౌడీలా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారన్నారు. ముఖ్యమంత్రి ప్రవర్తన చూస్తుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలా దిగజారుతున్నారని అర్ధమవుతోందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు తనవద్ద సమాధానం లేకపోవడంతో చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పథకం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణలకు ఉసి గొలుపుతున్నారని చెప్పారు. వీధిరౌడీలను గుర్తించి వారికి టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఇది రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. (సత్యనారాయణపురం) -
22 నుంచి పాదయాత్ర
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిసెంబరు 22 నుంచి సోమశిల నుంచి పాదయాత్ర ప్రారంభించి అన్ని మండలాలు తిరుగుతానని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనుమసముద్రంపేట లోని వీజీఆర్ రైస్ మిల్లు సమీపంలో శుక్రవారం మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఆ పార్టీ యువ నాయకులు పందిళ్లపల్లి గోపిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పరిచయ సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఆత్మకూరు తమ సొంత నియోజకవర్గమని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. జిల్లాలో ఆత్మకూరును రోల్‌మోడల్ నియోజకవర్గంగా చేస్తానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. -
ఎక్కడికక్కడ వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్
విజయవాడ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్భంధంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీమాంధ్రలో రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న పార్టీ నేత గౌతంరెడ్డిని పోలీసులు బుధవారం బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పార్టీ ఇతర నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టులు, నిర్భందాలు ఉద్యమాన్ని ఆపలేవని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా చెన్నూరులో పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో వారిని చెన్నూరు పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు, నిర్భందాలు ఉద్యమాన్ని ఆపలేవని... అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం భ్రమేనని నాయకులు స్పష్టం చేశారు. గుంటూరులోనూ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశంజిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బందించారు. ఒంగోలు శివార్లలోని త్రోవగుంట వద్ద ఐదో నంబర్ జాతీయ రహదారిపై పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరింత ఉధృతం చేసాయి. సమైక్యాంధ్ర డిమాండ్ తో ఆ పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల చెక్ పోస్ట్ ను దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి చెప్పారు.