
ఎక్కడికక్కడ వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్
విజయవాడ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్భంధంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీమాంధ్రలో రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న పార్టీ నేత గౌతంరెడ్డిని పోలీసులు బుధవారం బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పార్టీ ఇతర నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టులు, నిర్భందాలు ఉద్యమాన్ని ఆపలేవని గౌతంరెడ్డి స్పష్టం చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా చెన్నూరులో పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో వారిని చెన్నూరు పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు, నిర్భందాలు ఉద్యమాన్ని ఆపలేవని... అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం భ్రమేనని నాయకులు స్పష్టం చేశారు. గుంటూరులోనూ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశంజిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బందించారు. ఒంగోలు శివార్లలోని త్రోవగుంట వద్ద ఐదో నంబర్ జాతీయ రహదారిపై పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
సమైక్య ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరింత ఉధృతం చేసాయి. సమైక్యాంధ్ర డిమాండ్ తో ఆ పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల చెక్ పోస్ట్ ను దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి చెప్పారు.