కార్మిక హక్కుల సంరక్షణా స్ఫూర్తి మేడే! | Indian Labours Celebrates May Day From 1924 In India | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కుల సంరక్షణా స్ఫూర్తి మేడే!

Published Wed, May 1 2019 1:14 AM | Last Updated on Wed, May 1 2019 1:16 AM

Indian Labours Celebrates May Day From 1924 In India - Sakshi

కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చరిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే అలాంటి ఒక చరి త్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది కార్మికులు రక్తతర్పణం చేసి అమెరికాకే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు వినోదం (రిక్రియేషన్‌) అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మె చేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు.

అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. మనదేశంలో మొదటిసారిగా 1923లో ‘మే డే’ను పాటించారు. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటంతో అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాలకు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది యువతులు, యువకులు పని చేస్తున్నారు. ఈనాడు మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. కార్మిక చట్టాలు అమలుకాని ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10, 12 గంటలు పని చేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. ఐ.టి. రంగంలో కూడా కార్మిక చట్టాల అమలుకోసం పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి.  ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్‌సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు.

ఉదాహరణకు ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. నిరుద్యోగాన్ని, అశక్తతతను ఆసరా చేసుకుని వాళ్ళచే 10, 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుంచి 14 గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చది వించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్‌ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్‌ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ వలన వందేళ్ల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ట చేస్తున్నాయి.

ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని రగి లిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటిం చేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని మాత్రమే కాదు.. అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!

పి. గౌతమ్‌ రెడ్డి
వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ
ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement